బజాజ్‌ ఆటో... లాభం రూ.1,042 కోట్లు

21 Jul, 2018 00:39 IST|Sakshi

25 శాతం వృద్ధి రూ.7,267 కోట్లకు మొత్తం ఆదాయం

అంచనాలు మిస్‌... 9 శాతం పతనమైన షేర్‌  

న్యూఢిల్లీ: వాహన దిగ్గజం బజాజ్‌ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,042 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.837 కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి సాధించామని బజాజ్‌ ఆటో తెలిపింది.

అమ్మకాలు జోరుగా ఉండటంతో క్యూ1లో ఈ స్థాయి లాభం సాధించామని పేర్కొంది. గత క్యూ1లో రూ.5,740 కోట్లుగా ఉన్న అమ్మకాలు ఈ క్యూ1లో రూ.7,267 కోట్లకు పెరిగాయి. గతేడాది జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చినందున ఈ అమ్మకాల గణాంకాలను పోల్చడానికి లేదని వెల్లడించింది.

అంచనాలు మిస్‌...
కంపెనీ స్టాండెలోన్‌ నికర లాభం 21% వృద్ధితో రూ.1,115 కోట్లకు చేరింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే నికర లాభం 11% తగ్గింది. అంతకు ముందటి క్వార్టర్‌ (గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో) ఈ కంపెనీ రూ.1,175 కోట్ల నికర లాభం సాధించింది. మరోవైపు కంపెనీ లాభం  అంచనాలను అందుకోలేకపోయింది. ఈ కంపెనీ రూ.6,359 కోట్ల మొత్తం ఆదాయం,  రూ.1,261 కోట్ల నికర లాభం సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు.

అమ్మకాలు 38 శాతం అప్‌..
మొత్తం వాహన విక్రయాలు 38 శాతం వృద్ధి చెందాయి. గత క్యూ1లో 8.88 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ1లో 12.26 లక్షలకు పెరిగాయి. మొత్తం మోటార్‌ బైక్‌ల అమ్మకాలు 7.75 లక్షల నుంచి 33 శాతం వృద్ధితో 10.29 లక్షలకు పెరిగాయని, వీటిల్లో దేశీయ అమ్మకాలు 39 శాతం, ఎగుమతులు 25 శాతం చొప్పున  వృద్ధి చెందాయని కంపెనీ వివరించింది. వాణిజ్య వాహనాల దేశీయ విక్రయాలు 52,347 నుంచి 80 శాతం వృద్ధితో 94,431కు పెరిగాయి.  

9 శాతం పతనమైన షేర్‌
ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో బజాజ్‌ ఆటో షేర్‌ 9% పతనమై రూ.2,841 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 9.4% నష్టం తో రూ.2,820ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. షేర్‌ ధర భారీగా పతనం కావడంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,862 కోట్లు క్షీణించి రూ.82,212 కోట్లకు తగ్గింది.

మరిన్ని వార్తలు