ఎల్‌ఈడీ లైట్ల ధరలు దిగొస్తున్నాయి

7 Nov, 2015 02:19 IST|Sakshi
ఎల్‌ఈడీ లైట్ల ధరలు దిగొస్తున్నాయి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ దీపాల (లైటింగ్) పరిశ్రమ భారత్‌లో 10-12 శాతం వృద్ధి రేటుతో రూ.3,000 కోట్లకు చేరుకుంది. ఇందులో ఎల్‌ఈడీ లైటింగ్ వాటా 30% ఉన్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ తెలియజేసింది. పాతవారితో పాటు కొత్త కస్టమర్లు ఎల్‌ఈడీకి అప్‌గ్రేడ్ అవుతుండడంతో ఈ విభాగం 50% వార్షిక వృద్ధి నమోదు చేస్తోందని కంపెనీ లైటింగ్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ ఆర్.సుందరరాజన్ వెల్లడించారు. డాట్ నెక్స్ట్ శ్రేణి లైటింగ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా శుక్రవారమిక్కడ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుతో పాటు సబ్సిడీతో బల్బులను సరఫరా చేస్తుండటం పరిశ్రమకు ఊతమిస్తోందన్నారు. ‘ధరలు దిగివస్తుండటం వల్ల రెండేళ్లలో ఎల్‌ఈడీ లైట్ల వాటా 80%కి చేరుకుంటుంది. మూడేళ్ల క్రితంతో పోలిస్తే ధరలు 50% పైగా తగ్గాయి. వినియోగం పెరుగుతుండడంతో రానున్న రోజుల్లో మరింత దిగొస్తాయి. వీటితో విద్యుత్ బిల్లు సగం ఆదా చేసుకోవచ్చు’ అని చెప్పారు.
 
ఆన్‌లైన్‌కు ప్రత్యేకంగా..
బజాజ్ సొంత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లైట్లతోపాటు పలు ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి కంపెనీలతో రానున్న రోజుల్లో చేతులు కలపనుంది. మున్ముందు ఈ-కామర్స్ కంపెనీల కోసం ప్రత్యేక ఉత్పత్తులను రూపొందించాలన్నది బజాజ్ ఆలోచన. కాగా, ముంబైలో నిర్మిస్తున్న పరిశోధన, అభివృద్ధి కేంద్రం 8-10 నెలల్లో అందుబాటులోకి వస్తుందని సుందరరాజన్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు