దుస్తులకూ బజాజ్ ఈఎంఐ కార్డు

6 May, 2016 01:54 IST|Sakshi
దుస్తులకూ బజాజ్ ఈఎంఐ కార్డు

బజాజ్ ఫిన్‌సర్వ్ బిజినెస్ హెడ్ సంజీవ్ మఘె

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటిదాకా కన్జూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్ మొదలైన వాటికే పరిమితమైన ఈఎంఐ నెట్‌వర్క్ కార్డును తాజాగా దుస్తులు, హాలిడే ప్యాకేజీలు, చిన్న ఉపకరణాలు వాటి కొనుగోలుకు కూడా వర్తింపచేస్తున్నట్లు బజాజ్ ఫిన్‌సర్వ్ బిజినెస్ హెడ్ (ఈఎంఐ కార్డుల విభాగం) సంజీవ్ మఘె తెలిపారు. ఇందుకోసం కనీస ఇన్‌వాయిస్ మొత్తం రూ. 5,000గా ఉంటుందని గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్, పుణే, బరోడా నగరాల్లో మాత్రమే ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టామని, త్వరలో మిగతా నగరాల్లోనూ అందుబాటులోకి తేనున్నామని వివరించారు. దీనికోసం హైదరాబాద్‌లో 25 బ్రాండ్స్, 100 పైగా స్టోర్స్‌తో చేతులు కలిపినట్లు సంజీవ్ చెప్పారు.

 మూడు నగరాల్లో మొత్తం 300 పైగా స్టోర్స్‌తో భాగస్వామ్యం ఉందని, వచ్చే నాలుగేళ్లలో దీన్ని 50 వేల అవుట్‌లెట్స్‌కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఆయా స్టోర్స్‌లో దుస్తులు, ఐ వేర్ లాంటి ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు కార్డును స్వైప్ చేసి, ఈఎంఐల్లోకి మార్చుకోవచ్చని చెప్పారు. కోచింగ్ క్లాస్‌లకు కూడా దీన్ని విస్తరించే యోచనలో ఉన్నట్లు సంజీవ్ పేర్కొన్నారు. హాలిడే ప్యాకేజీల కోసం కాక్స్ అండ్ కింగ్స్‌తో టైఅప్ పెట్టుకోగా, నిర్దిష్ట ఉత్పత్తుల కోసం ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కూడా చేతులు కలిపినట్లు వివరించారు. డ్యూరబుల్స్ అమ్మకాల్లో దాదాపు అయిదో వంతు బజాజ్ ఫైనాన్స్ ద్వారానే జరుగుతున్నాయని సంజీవ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు