బజాజ్‌ ఫైనాన్స్‌ లాభం రూ.557 కోట్లు..

17 Oct, 2017 08:16 IST|Sakshi

ముంబై: ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ..బజాజ్‌ ఫైనాన్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.557 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో సాధించిన నికర లాభంతో పోల్చితే 37% వృద్ధి సాధించామని బజాజ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. జీఎస్‌టీ అమలు సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ, ఈ స్థాయి నికర లాభం సాధించామని కంపెనీ ఎండీ, రాజీవ్‌ జైన్‌ చెప్పారు.

తమ ఎస్‌ఎంఈ లోన్‌బుక్‌పై జీఎస్‌టీ ప్రభావం చూపిందని వివరించారు. మరో ఆర్నెల్ల పాటు జీఎస్‌టీ భారం ఉండనున్నదని ఆయన అంచనా వేస్తున్నారు. నిర్వహణ ఆస్తులు రూ.52,332 కోట్ల నుంచి 38% వృద్ధితో రూ.72,139 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.

స్థూల మొండి బకాయిలు 1.68%గా, నికర మొండి బకాయిలు 0.51%గా ఉన్నాయని వివరించారు. కేటాయింపులు రూ.165 కోట్ల నుంచి రూ.228 కోట్లకు పెరిగాయని వివరించారు. ఎస్‌ఎంఈ రుణాలు 18 శాతం వృద్ధి చెందగా, కన్సూమర్‌ రుణాలు 42 శాతం పెరిగాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్‌ 4 శాతం నష్టపోయి రూ.1,889 వద్ద ముగిసింది.

ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం 31 శాతం అప్‌
న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 31 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.201 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.264 కోట్లకు ఎగసిందని ఫెడరల్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,338 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.2,667 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 2.78% నుంచి 2.39 శాతానికి, నికర మొండి బకాయిలు 1.61 శాతం నుంచి 1.32 శాతానికి  తగ్గాయని తెలిపింది.

అయితే మొండి బకాయిలు, అత్యవసరాలకు కేటాయింపులు రూ.168 కోట్ల నుంచి రూ.177 కోట్లకు పెరిగాయని పేర్కొంది.  ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారమే మొండి బకాయిలకు కేటాయింపులు జరిపామని వివరించింది. ఇక బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం రూ.726 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.899 కోట్లకు పెరిగింది. ఈ బ్యాంక్‌ ఫలితాలు అంచనాలను మించడం, మొండి బకాయిలు తగ్గి రుణ నాణ్యత మెరుగుపడటంతో ఈ షేర్‌ సోమవారం 6.4 శాతం ఎగబాకి ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయిలో రూ.125 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు