బజాజ్ ఫైనాన్స్ లాభం 54 శాతం వృద్ధి

27 Jul, 2016 01:22 IST|Sakshi
బజాజ్ ఫైనాన్స్ లాభం 54 శాతం వృద్ధి

ఇదే అత్యుత్తమ త్రైమాసిక నికర లాభం
ముంబై : బ్యాంకేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ) బజాజ్ ఫైనాన్స్ తన  చరిత్రలోనే అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో  నికర లాభం 54 శాతం వృద్ధి చెంది రూ.424 కోట్లకు పెరిగిందని బజాజ్ గ్రూప్‌కు చెందిన బజాజ్ ఫైనాన్స్ తెలిపింది. రిటైల్, ఎస్‌ఎంఈ రుణాల జోరు కారణంగా ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని కంపెనీ ఎండీ రాజీవ్ జైన్ చెప్పారు.

ఈ క్వార్టర్‌లో వచ్చినంత నికర లాభం మరే క్వార్టర్‌లోనూ రాలేదని పేర్కొన్నారు. వినియోగదారుల వ్యాపారం 47 శాతం, ఎస్‌ఎంఈ సెగ్మెంట్ 20 శాతం చొప్పున వృద్ధి సాధించాయని వివరించారు. రుణ నష్టాలు, కేటాయింపులు 75 శాతం పెరిగి రూ.180 కోట్లకు చేరినప్పటికీ, మొత్తం ఆదాయం 39 శాతం వృద్ధి చెంది రూ.2,301 కోట్లకు పెరిగిందని రాజీవ్ జైన్ పేర్కొన్నారు.

 జోరుగా  షేర్ ధర: బజాజ్ ఫైనాన్స్ షేర్ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిని (రూ.9,990) తాకిన  ఈ షేర్ చివరకు 10 శాతం లాభంతో రూ.9,853 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 2.6 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 9.5 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

 1:1 బోనస్: రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.2 ముఖ విలువ గల షేర్లుగా విభజించడానికి డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని బజాజ్ ఫైనాన్స్ వెల్లడించింది. షేర్ల విభజన తర్వాత రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు అంతే ముఖ విలువ గల ఒక షేర్‌ను బోనస్‌గా ఇవ్వడానికి కూడా డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని కంపెనీ పేర్కొంది.

మరిన్ని వార్తలు