బజాజ్ ‘వి’ బైక్ వచ్చేసింది..

2 Feb, 2016 00:35 IST|Sakshi
బజాజ్ ‘వి’ బైక్ వచ్చేసింది..

వి15 పేరుతో 150 సీసీ బైక్
అందుబాటు ధరలో ప్రీమియం లుక్


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో ‘వి’ సిరీస్‌లో తొలి బైక్ వి15ను ఢిల్లీ వేదికగా ఆవిష్కరించింది. ప్రీమియం లుక్‌తో ఉన్నప్పటికీ ధర రూ.60 వేలకు దగ్గరగా ఉండొచ్చు. 150 సీసీ సామర్థ్యం, సింగిల్ సిలిండర్, డీటీఎస్‌ఐ ఇంజిన్, ముందు వైపు టెలిస్కోపిక్, వెనుకవైపు గ్యాస్ ఫిల్డ్ ట్విన్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ పొందుపరిచారు. ట్యాంకు సామర్థ్యం 13 లీటర్లు, బరువు 135.5 కిలోలు ఉంది. నిత్యం ప్రయాణించేవారి కోసం కంపెనీ దీనిని రూపొందించింది. టూరర్, కమ్యూటర్ బైక్‌ల కలయికలా ఉంది. ప్రస్తుతం రెండు రంగుల్లో ప్రవేశపెట్టారు. భారత తొలి విమాన వాహక నౌక అయిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ నుంచి సేకరించిన లోహంతో ‘వి’ బైక్‌లను తయారు చేశారు. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ ట్యాంకు పైన ప్రత్యేక లోగోను ముద్రించారు. అందమైన ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్ ఏర్పాటు చేశారు.

 మార్చి నుంచి మార్కెట్లో..
వి15 బైక్‌ల ఉత్పత్తిని ఫిబ్రవరి 5 నుంచి మొదలు పెట్టనున్నారు. మార్చి నుంచి ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయని బజాజ్ ద్విచక్ర వాహన విభాగం ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ తెలిపారు. కమ్యూటర్ బైక్‌ల విభాగంలో కొత్త శకానికి ‘వి’ నాంది పలుకుతుందని వ్యాఖ్యానించారు. నెలకు 20,000 బైక్‌లను ఉత్పత్తి చేయనున్నారు. డిమాండ్‌నుబట్టి సామర్థ్యాన్ని పెంచుతారు. ఎగుమతులపై ఇప్పుడే దృష్టిసారించబోమని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి భారత్‌పైనే ఫోకస్ అని స్పష్టం చేసింది.

 బజాజ్ నుంచి స్కూటర్?
స్కూటర్ల విపణిలోకి బజాజ్ తిరిగి ప్రవేశిస్తోందా? బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ మాటలను బట్టి ఇది అవగతమవుతోంది. స్కూటర్లను తయారు చేయబోమని కంపెనీ ఎన్నడూ పేర్కొనలేదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ కంపెనీ అయిన బజాజ్ సమయాన్నిబట్టి తగు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. వి15 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా స్పందించారు.

 వారం లోపే మర్చిపోతారు..
ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో పాల్గొనడం ఖరీదైన అంశమని రాజీవ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘ఖరీదైన ప్రదర్శన (కాన్సెప్ట్) అనవసరం. ఎక్స్‌పోలో పాల్గొనాలంటే రూ.10-15 కోట్లు ఖర్చవుతుంది. బాగా డబ్బున్న కంపెనీలు ఈ పని చేయవచ్చు. మాది చిన్న కంపెనీ. అంత పెద్ద మొత్తాన్ని మేం వెచ్చించలేం. వి మోడల్‌ను ఆటో ఎక్స్‌పోకు బదులుగా ఇక్కడ రూ.5 లక్షల తోనే కార్యక్రమాన్ని పూర్తి చేశాం’ అని అన్నారు. సుస్థిర స్థానం సంపాదించిన బజాజ్‌కు ఎక్స్‌పో ద్వారా బ్రాండ్ అవగాహన కల్పించాల్సిన అవసరం లేదన్నారు. కొత్త టెక్నాలజీ, కాన్సెప్ట్ ప్రదర్శించేందుకే 2014 ఎక్స్‌పోలో పాల్గొన్నట్టు చెప్పారు. షోలో చూపిన ఉత్పత్తులను వారం రోజుల్లోపే జనం మర్చిపోతారు. దీర్ఘకాలం ఎవరూ గుర్తు పెట్టుకోరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు