బజాజ్‌–వి 125 సీసీ బైక్‌..

6 Jan, 2017 00:46 IST|Sakshi
బజాజ్‌–వి 125 సీసీ బైక్‌..

‘వి’ సిరీస్‌లో రెండో మోడల్‌
ఎక్స్‌షోరూం ధర రూ.57,375

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్‌ ఆటో ‘వి’ సిరీస్‌లో మరో బైక్‌ను ప్రవేశపెట్టింది. వి–12 పేరుతో 125 సీసీ సామర్థ్యంతో దీనిని రూపొందించారు. విశ్రాంత విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ విడిభాగాలతో ‘వి’ బైక్స్‌ తయారవుతున్నాయి. అధికారికంగా ఆవిష్కరణ కార్యక్రమం చేయకుండానే షోరూంలలో వి–12 అమ్మకాలను కంపెనీ ప్రారంభించింది. హైదరాబాద్‌ ఎక్స్‌షోరూంలో ధర రూ.57,375 ఉంది. డిజైన్‌ పరంగా చూస్తే కొత్త బైక్‌ వి–15ను పోలి ఉంటుంది. సింగిల్‌ సిలిండర్, 4 స్ట్రోక్‌ ఎయిర్‌కూల్డ్‌ డీటీఎస్‌–ఐ 124.5 సీసీ ఇంజన్, 13 లీటర్ల ట్యాంకు పొందుపరిచారు. వాహనం పొడవు 2,040 ఎంఎం, ఎత్తు 1,066 ఎంఎం, అయిదు గేర్లు, 5 స్పోక్‌ అలాయ్‌ వీల్స్, డ్రమ్‌ బ్రేక్స్, బరువు 133 కిలోలు ఉంది. ఫ్రంట్‌ టెలిస్కోపిక్, వెనుక వైపు ట్విన్‌ షాక్స్, నైట్రాక్స్‌ సస్పెన్షన్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి వైన్‌ రెడ్, ఎబోనీ బ్లాక్‌ రంగుల్లో లభిస్తోంది.

ఇప్పటికే 2 లక్షలకుపైగా..: ‘వి’ సిరీస్‌లో తొలి బైక్‌ అయిన వి–15కు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. 150 సీసీ సామర్థ్యంతో దీనిని తయారు చేశారు. విడుదలైన ఎనిమిది నెలల్లో 2 లక్షలకుపైగా బైక్‌లు రోడ్డెక్కాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్‌ ఉందని బజాజ్‌ ఆటో డీలర్‌ శ్రీ వినాయక బజాజ్‌ గ్రూప్‌ ఎండీ కె.వి.బాబుల్‌రెడ్డి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. 125 సీసీలో హోండా సీబీ షైన్‌ ఎస్‌పీ, హీరో గ్లామర్‌ 125, యమహా సాల్యూటో మోడళ్లతో బజాజ్‌ కొత్త బైక్‌ పోటీపడనుంది.

>
మరిన్ని వార్తలు