బజాజ్ ఆటో ప్లాంట్‌లో కరోనా కలకలం 

26 Jun, 2020 21:08 IST|Sakshi

140 కరోనా కేసులు, రెండు మరణాలు

కార్యకలాపాలు యథాతధం 

సాక్షి, ముంబై: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్‌కు చెందిన వలూజ్ ప్లాంట్‌లో 140 కరోనా కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. కరోనా బారిన పడి ఇప్పటివరకూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని  సంస్థ ప్రకటించింది. అయితే కంపెనీ మూసివేత  అంచనాలను కంపెనీ తోసిపుచ్చింది. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులలో 2 శాతం మందే ప్రభావితమయ్యారని అవసరమైన భద్రతా చర్యలతో ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు .

జూన్ 6న మొదటి కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైందని బజాజ్ ఆటోఅధికారికంగా ప్రకటించింది. 8100 మందికి పైగా ఉన్న ఉద్యోగులలో ఎక్కువమందికి పాజిటివ్ రావడంతో దేశీయ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ ఔరంగాబాద్‌లోని వలూజ్ కర్మాగారంలో కార్యకలాపాలను మూసివేసిందన్న నివేదికలను సంస్థ ఖండించింది. హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఇతర అనారోగ్యాలు కూడా తోడవ్వడంతో దురదృష్టవశాత్తు ఇద్దరు ఉద్యోగులు చనిపోయారని బజాజ్ ఆటో లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ రవి కైరాన్ రామసామి వివరించారు. ప్రోటోకాల్ ప్రకారం పరీక్ష, కాంటాక్ట్ ట్రేసింగ్, సెల్ఫ్ క్వారంటైన్, పూర్తి పారిశుద్ధ్యం  లాంటి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. బాధిత ఉద్యోగులకు వైద్య సహాయంతో సహా అన్ని సహకారాన్ని అందిస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు.

కాగా  బజాజ్ ఆటోకు చెందిన అతిపెద్ద తయారీ యూనిట్ వాలూజ్ ప్లాంట్ లో ప్రధానంగా ఎగుమతి కోసం మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు మొదటి దశ  దేశ వ్యాప్త లాక్ డౌన్ ను క్రూరమైన చర్యగా రాజీవ్ బజాజ్  విమర్శించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు