బంధన్‌ బ్యాంక్‌ లాభం రూ.388 కోట్లు

28 Apr, 2018 01:23 IST|Sakshi

ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌

న్యూఢిల్లీ: బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 20 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.322 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.388 కోట్లకు పెరిగిందని బంధన్‌ బ్యాంక్‌ సీఈఓ, ఎమ్‌డీ చంద్ర శేఖర్‌ ఘోష్‌ చెప్పారు.

నికర వడ్డీ ఆదాయం రూ.689 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.863 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.వడ్డీయేతర (ఇతర)ఆదాయం రూ.129 కోట్ల నుంచి 57 శాతం వృద్ధితో రూ.203  కోట్లకు పెరిగిందని వివరించారు. మొత్తం ఆదాయం రూ.1,208 కోట్ల నుంచి 29 శాతం పెరిగి రూ.1,554 కోట్లకు ఎగసిందని తెలిపారు. కేటాయింపులు రూ.36 కోట్ల నుంచి మూడింతలై రూ.109 కోట్లకు ఎగిశాయని తెలిపారు.

రుణాలు 37 శాతం, డిపాజిట్లు 46 శాతం చొప్పున పెరిగాయని పేర్కొన్నారు. ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌ ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, వ్యవసాయ రుణాల మాఫీ కారణంగా సూక్ష్మరుణ విభాగంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం ఉందని వివరించారు.  

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 2016–17లో రూ.1,112 కోట్లుగా ఉన్న నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.1,346 కోట్లకు పెరిగిందని చంద్ర శేఖర్‌ పేర్కొన్నారు. వడ్డీ ఆదాయం 26 శాతం వృద్ధితో రూ.3,032 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 72 శాతం పెరుగుదలతో రూ.706 కోట్లకు పెరిగాయని వివరించారు.

మొత్తం ఆదాయం రూ.4,320 కోట్ల నుంచి రూ.5,508 కోట్లకు వృద్ధి చెందిందని పేర్కొన్నారు. స్థూల మొండి బకాయిలు రూ.86 కోట్ల నుంచి రూ.373 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.61 కోట్ల నుంచి రూ.173 కోట్లకు పెరిగాయని తెలిపారు. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 0.51 శాతం నుంచి 1.25 శాతానికి,  నికర మొండి బకాయిలు 0.36 శాతం నుంచి 0.58 శాతానికి పెరిగాయని తెలిపింది. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బంధన్‌ బ్యాంక్‌ షేర్‌ 2.4 శాతం లాభంతో రూ.505 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు