బంధన్‌ బ్యాంక్‌ లాభం 68 శాతం అప్‌

3 May, 2019 00:46 IST|Sakshi

ఒక్కో షేర్‌కు రూ.3 డివిడెండ్‌

కోల్‌కత: ప్రైవేట్‌  రంగ బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 68% ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి త్రైమాసిక కాలంలో రూ.651కోట్ల నికర లాభం సాధించామని బంధన్‌ బ్యాంక్‌ తెలిపింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్‌లో ఇది రూ.388 కోట్లని బ్యాంక్‌ ఎమ్‌డీ సీఎస్‌ ఘోష్‌ తెలిపారు. ఇతర ఆదాయం దాదాపు రెట్టింపు కావడం, ఫీజు ఆదాయం పెరగడంతో గత క్యూ4లో నికర లాభంలో భారీ వృద్ధి సాధించామని తెలిపారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు.  

10.69 శాతానికి నికర వడ్డీ మార్జిన్‌.. 
నికర వడ్డీ మార్జిన్‌ 9.32 శాతం నుంచి 10.69 శాతానికి పెరిగిందని ఘోష్‌ తెలిపారు. నికర వడ్డీ ఆదాయం  రూ.864 కోట్ల నుంచి 46 శాతం వృద్ధితో రూ.1,258 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.  రుణాలు రూ.32,339 కోట్ల నుంచి 38 శాతం వృద్ధితో రూ.44,776 కోట్లకు పెరిగాయని, డిపాజిట్లు రూ.33,869 కోట్ల నుంచి 28 శాతం పెరిగి రూ.43,232 కోట్లకు చేరాయని వివరించారు.   

మెరుగుపడిన రుణ నాణ్యత... 
సీక్వెన్షియల్‌గా చూస్తే, బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌లో 2.41 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్‌లో 2.04 శాతానికి తగ్గాయని ఘోష్‌ తెలిపారు.  నికర మొండి బకాయిలు 0.70 శాతం నుంచి 0.58 శాతానికి తగ్గాయని తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలకు రుణాలివ్వడం వల్ల మొండి బకాయిలు పెరిగాయని పేర్కొన్నారు.  ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,346 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 45 శాతం వృద్ధితో రూ.1,952 కోట్లకు పెరిగిందని బంధన్‌ బ్యాంక్‌ తెలిపింది.  ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్‌ఈలో బంధన్‌ బ్యాంక్‌ షేర్‌ 4.3 శాతం లాభంతో రూ.624 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు