పెట్రోల్‌ కొట్టించండి : కడుపు నింపుకోండి

4 Oct, 2017 19:49 IST|Sakshi

 బెంగుళూరులో ఓ పెట్రోల్‌ బంకు యాజమాన్యం వినూత్న ప్రయోగం

 వాహన దారులకు ఉచిత భోజనం అందజేస్తున్న వైనం

 ఐఓసీ సహకారంతో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభం

సాక్షి, బెంగళూరు : పెరుగుతున్న పెట్రోల్‌ ధరలపై వాహనదారులు మండిపడటం సహజం. అయితే, పెట్రోల్‌ మంటలు చల్లార్చలేము కానీ మీ ఆకలి మంటలు తీర్చుతామంటూ ముందుకొచ్చారు ఓ పెట్రోల్‌ బంకు యజమాని. బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉన్న ఓ పెట్రోల్‌ బంకులోనికి వెళితే మాత్రం కేవలం మీ వాహనానికి మాత్రమే కాదు మీ ఆకలి తీర్చే ఇంధనం కూడా లభిస్తుంది. అది కూడా ఫ్రీగా. ‘మీరు మీ ట్యాంకును నింపుకోండి – మేము మీ కడుపు నింపుతాము’ (యు ఫిల్‌ యువర్‌ ట్యాంక్‌! వి ఫిల్‌ యువర్‌ టమ్మీ) పేరిట ఇందిరానగర్‌లోని వెంకటేశ్వర సర్వీస్‌ స్టేషన్‌లో పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం చేపట్టారు.
 
రోడ్ల పైనే సగం సమయం....
బెంగళూరు వాసులు తమ తమ ఇళ్లలో కంటే నగర రోడ్ల పైనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. కారణం నగరంలో ఎప్పుడూ రద్దీగా కనిపించే రోడ్లు. కార్యాలయానికి సమయానికి చేరుకోవాలన్నా, పాఠశాలకు తొందరగా వెళ్లాలన్నా ఏది ఏమైనా, ఎంత తొందరగా ఇంటి నుండి బయలు దేరినా గంటల పాటు నగర రోడ్ల పై పడిగాపులు కాయాల్సిందే. ఈ ఉరుకులు, పరుగులతోనే చాలా మంది తమ బ్రేక్‌ఫాస్ట్‌ని, భోజనాన్ని కూడా వదిలేస్తుంటారు. దీంతో ఇక సాధారణంగానే అనేక ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఎంత సమయం తక్కువగా ఉన్నాకూడా తమ వాహనాలకు ఇంధనాన్ని నిలుపుకునేందుకు పెట్రోల్‌ బంకు దగ్గర మాత్రం ఓ ఐదు నుండి పది నిమిషాల పాటు తప్పక వేచి ఉండాల్సిన సందర్భాలు అనేకం ఉంటాయి. ఆ సమయంలోనే వారికి కాస్తంత భోజనం కూడా అందజేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండి పుట్టుకొచ్చిందే ఈ కార్యక్రమం.

పైలెట్‌ ప్రాజెక్టుగా....నెల రోజులు ఉచితంగా....
ఇందిరానగరలోని వెంకటేశ్వర సర్వీస్‌ సెంటర్‌ యజమాని ప్రకాష్‌రావు ఆలోచన నుండి పుట్టినదే ఈ కార్యక్రమం. ‘పెట్రోల్‌ బంకుల వద్ద ఉంటే ఖాళీ స్థలంలో ఫుడ్‌ కౌంటర్‌లను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) అధికారులు అంగీకరించారు. ఇక పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ పెట్రోల్‌ బంకులో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు మా వినియోగదారులకు ఉచితంగా భోజనాన్ని అందిస్తాం. ఆ తరువాత కొంత మొత్తాన్ని వసూలు చేస్తాం. మా వద్ద శాఖాహార, మాంసాహార భోజనాలతో పాటు రోజులో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా అల్పాహారం, స్నాక్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు తమకు ఏ పదార్థాం కావాలో చెప్పిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే ఆహారాన్ని ప్యాక్‌ చేసి అందిస్తాం. ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో నగరంలో ఎక్కువ మంది వినియోగదారులు వచ్చే 100 ఐఓసీ పెట్రోలు బంకులకు ఈ కార్యక్రమానికి విస్తరించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాం’ అని సంస్థ ప్రతినిధి  ప్రకాష్‌రావు తెలిపారు.

ప్రత్యేక కిచెన్‌ కూడా.......
ఇక ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా ఓ సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో నిపుణులైన చెఫ్‌లు అన్ని రకాల వంటలను తయారుచేస్తారు. అక్కడ తయారు చేసిన వంటకాలను పెట్రోల్‌ బంకులో అందుబాటులో ఉంచుతారు. ఇక బేకరీ ప్రాడక్ట్స్‌ తయారీ కోసం ఇస్కాన్‌తో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే సందర్భంలో వినియోగదారులు కాని వారు కూడా కొంత మేరకు డబ్బులు చెల్లించి, ఇక్కడ ఆహారాన్ని పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు