బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం నాలుగు రెట్లు

30 Jan, 2019 00:56 IST|Sakshi

క్యూ3లో రూ. 471 కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) నికర లాభం నాలుగు రెట్లు ఎగిసి, రూ. 471 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 112 కోట్లు. మరోవైపు, మూడో త్రైమాసికంలో ఆదాయం రూ. 12,976 కోట్ల నుంచి రూ. 14,563 కోట్లకు పెరిగింది. క్యూ3లో స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) 11.31% నుంచి 11.01%కి, నికర ఎన్‌పీఏలు 4.97 శాతం నుంచి 4.26%కి తగ్గాయి. విలువపరంగా చూస్తే.. డిసెంబర్‌ 31 నాటికి స్థూల మొండిబాకీలు రూ. 53,184 కోట్లుగా ఉన్నాయి.
 

మొండిబాకీలకు కేటాయింపులు రూ. 3,155 కోట్ల నుంచి రూ. 3,416 కోట్లకు పెరిగాయి. రుణ నాణ్యత మెరుగుపడటం, లో బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా లాభాలు మెరుగుపడ్డాయని బ్యాంక్‌ ఎండీ పి.ఎస్‌. జయకుమార్‌ తెలిపారు. నికర వడ్డీ మార్జిన్‌ 1.99 శాతం నుంచి 2.69 శాతానికి చేరింది.  సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ రుణాలు ఇందులో రూ. 1,169 కోట్లుగా ఉన్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు బీవోబీ మొత్తం రూ. 4,677 కోట్లు రుణమిచ్చింది. మరోవైపు రూ. 31,000 కోట్ల ఫ్రాడ్‌లో చిక్కుకున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ గ్రూప్‌నకు బీవోబీ రూ. 4,000 కోట్ల రుణాలిచ్చింది.   

మరిన్ని వార్తలు