బ్యాంక్ ఎఫ్‌డీయా? డెట్ ఫండా?

14 Jul, 2014 00:36 IST|Sakshi
బ్యాంక్ ఎఫ్‌డీయా? డెట్ ఫండా?

నేను  ప్రస్తుతం క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇటీవలే నిఫ్టీ బిఈఈఎస్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తున్నాను. ఇది మంచి రాబడినే ఇస్తోంది. ఈ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటా రా? సుందరం సెలెక్ట్ మిడ్‌క్యాప్, బీఎన్‌పీ పారిబస్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌ల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ రెండు ఒకే ఫండ్ హౌస్‌కు చెందినవా?                                       
- జానకి, అమలాపురం

 
ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎంత రాబడి పొందవచ్చో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. నిఫ్టీ ఇండెక్స్‌ను పూర్తిగా ప్రతిబింబించే నిఫ్టీ బీఈఈఎస్ ఈటీఎఫ్ -నిఫ్టీ లాగానే రాబడులందిస్తోంది. అంతేకాకుండా భారత్‌లో అత్యంత తక్కువ వ్యయాలున్న ఫండ్ కూడా ఇదే. దీని ఎక్స్‌పెన్స్ రేషియో 0.5 శాతంగా ఉంది. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇండెక్స్ ఫండ్ సరైనది కాదని చెప్పవచ్చు. పదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నిఫ్టీ కంటే డైవర్సిఫైడ్ ఫండ్‌లు ఉత్తమమని చెప్పవచ్చు.

మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మూడు ఫండ్స్- క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ డైనమిక్, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీలు దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి ఫండ్స్ అని పేర్కొనవచ్చు. ఇక బీఎన్‌పీ పారిబస్, సుందరం సెలెక్ట్ మిడ్‌క్యాప్‌లు ఒకే కంపెనీకి చెందిన ఫండ్స్ కావు. బీఎన్‌పీ పారిబస్, సుందరం సంస్థలు గతంలో జాయింట్ వెంచర్‌ను నిర్వహించాయి. కొన్నేళ్ల కితం ఈ జాయింట్ వెంచర్‌ను ఈ రెండు సంస్థలు రద్దు చేసుకున్నాయి. ఇవి రెండు విభిన్నమైన ఫండ్లు. మంచి రాబడులనే ఇస్తున్నాయి.
 
డెట్ ఫండ్స్ గురించి వివరించండి. వీటికి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు తేడా ఏమిటి?                  
- రమేశ్, జగిత్యాల


బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో గ్యారంటీ రాబడులు వస్తాయి. ఎంత రాబడులు వస్తాయో ముందే తెలుస్తుంది. మరోవైపు డెట్ ఫండ్స్‌ల్లో రాబడులు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోల్చితే ఎక్కువ రావచ్చు. లేదా తక్కువ రావచ్చు. అయితే ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా తేడా బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా స్వల్పంగానే ఉంటుంది. డెట్ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ కేటగిరీ ఫండ్స్. అంటే మీరు ఈ ఫండ్స్‌ల్లో ఎప్పుడైనా, ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
 
అలాగే ఎప్పుడైనా, ఈ ఫండ్స్‌నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. కొన్ని డెట్ ఫండ్స్‌ల్లో మీకు అసలు నష్టాలే రావు. వివిధ రకాల డెట్‌ఫండ్స్ విషయానికొస్తే, లిక్విడ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నష్టాలు రావడమనేది చాలా అరుదు. అయితే బాండ్ ఫండ్స్‌ల్లో మాత్రం వడ్డీరేట్లు పెరిగితే బాండ్ ఫండ్స్ విలువ తగ్గుతుంది. ఇక ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్ విషయానికొస్తే, ఈ ఫండ్ వల్ల మీకు పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. అదే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ విషయానికొస్తే, దీనిపై వచ్చే వడ్డీ మీ ఆదాయానికి కలిపి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది కాలానికి మించి కొనసాగిస్తే, వాటిపై వచ్చే రాబడులను క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు.
 
నేను నెలకు రూ.10,000 మొత్తాన్ని  10-15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఏడాదికి ఎల్‌ఐసీ  జీవన్ ఆనంద్ కింద రూ.42,000, పీపీఎఫ్ కింద రూ.10,000 చొప్పున చెల్లిస్తున్నాను. రెలిగేర్ నుంచి రూ.50 లక్షల టెర్మ్‌ప్లాన్‌ను తీసుకున్నాను. ఇన్వెస్ట్ చేయడానికి తగిన ఫండ్స్ సూచించండి?
- జాన్ పాషా, నిజామాబాద్

 
మీ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా మీరు చేయాల్సింది ఏమంటే, ఒక అత్యవసర ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవడం. ఏ సమయంలోనైనా వెంటనే మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కితీసుకునేలా ఈ ఫండ్ ఉండాలి. ఇది కాకుండా, ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇక టెర్మ్ ప్లాన్‌ను కొనసాగించండి. ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్, పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ విషయానికొస్తే, 10-15 కాలానికి ఏదైనా ఒకటే. ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ అనేది  యులిప్(యూ నిట్ లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్).
 
బీమా లేదా ఇన్వెస్ట్‌మెంట్ పూర్తి ప్రయోజనాలను ఇది ఇవ్వలేదని చెప్పవచ్చు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు పీపీఎఫ్ కూడా సరైనది కాదని నేను భావిస్తున్నాను. మరోవైపు ఏవైనా రెండు బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. మ్యూచువల్ ఫండ్స్‌పై మీకు సరైన అవగాహన వచ్చాకే పూర్తి స్థాయి ఈక్విటీ ఫండ్స్‌కు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మళ్లించండి. మీరు ఎంచుకోవడానికి ఉన్న కొన్ని ఆప్షన్లలో టాటా బ్యాలెన్స్‌డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌డ్ అడ్వాండేజ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను పరిశీలించండి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా