బ్యాంకు మోసాలు.. @ రూ.2 లక్షల కోట్లు!

13 Jun, 2019 05:23 IST|Sakshi

11 ఏళ్లలో రూ.2.05 లక్షల కోట్లుగా నమోదు

53 వేలకు పైగా చీటింగ్‌ కేసులు

అత్యధికం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో 

న్యూఢిల్లీ : దేశీయ బ్యాంకులు మోసగాళ్లకు లక్ష్యంగా మారుతున్నాయి. గత 11 ఏళ్లలో రూ.2.05 లక్షల కోట్ల మేర భారీ మోసాలు ఇక్కడి బ్యాంకుల్లో చోటు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. సంఖ్యా పరంగా ఎక్కువ ఘటనలు అత్యధికం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల్లోనే జరిగినట్టు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారీగా మోసపోయినది మాత్రం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు!!. ఈ బ్యాంకులో మోసపు ఘటనలు 2,047 నమోదయినప్పటికీ, విలువ మాత్రం 28,700 కోట్ల మేర ఉంది. ముఖ్యంగా వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ఒక్కరే రూ.13,000 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన విషయం గమనార్హం. పీఎన్‌బీ తర్వాత ఎస్‌బీఐకి మోసాల సెగ ఎక్కువగా తగిలింది. 23,734 కోట్ల మేర మోసాలు జరిగాయి. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు బదులుగా ఈ వివరాలను ఆర్‌బీఐ వెల్లడించింది. 2008–09 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం53,334 మోసపూరిత కేసులు నమోదయ్యాయి. 

పీఎన్‌బీలో భారీగా...  
పీఎన్‌బీలో రూ.28,700 కోట్ల మొత్తానికి సంబంధించి 2,047 మోసాలు జరిగాయి. ఐసీఐసీఐ బ్యాంకులో రూ.5,033.81 కోట్లకు సంబంధించి 6,811 కేసులు ఈ కాలంలో నమోదయ్యాయి. ప్రభుత్వరంగంలోని ఎస్‌బీఐలో 6,793 మోసపు ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటి విలువ రూ.12,358 కోట్లు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులోనూ రూ.1,200.79 కోట్లకు సంబంధించి 2,497 మోసపూరిత ఘటనలు జరిగాయి. బ్యాంకు ఆఫ్‌ బరోడాలో 2,160 మోసపూరిత కేసులు నమోదు కాగా, వీటి మొత్తం రూ.12,962.96 కోట్లుగా ఉంది. 

విదేశీ బ్యాంకుల్లోనూ...: భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంకులు సైతం మోసపూరిత ఘటనల బారిన పడినట్టు తెలుస్తోంది. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ ఇదే కాలంలో 1,862 మోసపూరిత కేసులను రిపోర్ట్‌ చేసింది. వీటి మొత్తం రూ.86.21 కోట్లు. అలాగే, సిటీ బ్యాంకులో రూ.578 కోట్లకు సంబంధ/æంచి 1,764 కేసులు వెలుగు చూశాయి. హెచ్‌ఎస్‌బీసీలో రూ.312 కోట్ల మేర రూ.1,173 మోసాలు, రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌ పీఎల్‌సీలో రూ.12.69 కోట్ల మేర 216 కేసులు, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంకులో రూ.1,221.41కోట్లతో ముడిపడిన 1,263 ఘటనలు వెలుగు చూశాయి.   

మరిన్ని వార్తలు