మోదీ 'నీరవ్‌' కాకూడదు

7 Mar, 2018 13:04 IST|Sakshi

న్యూఢిల్లీ : బ్యాంకుల్లో వెలుగు చూస్తున్న కుంభకోణాలపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వంపై మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో రూ.54,317 కోట్ల బ్యాంకు కుంభకోణాలు జరిగాయని, ఈ విషయంపై నరేంద్రమోదీ గొంతు విప్పాలని డిమాండ్‌ చేసింది. నీరవ్‌(సైలెంట్‌) మోదీ నుంచి ప్రధాని బయటికి రావాలని భారత్‌ డిమాండ్‌ చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ కమ్యూనికేషన్స్‌ ఇన్‌ఛార్జ్‌ రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. అంటే ప్రధాని మోదీ నీరవ్‌(సైలెంట్‌) మోదీ కాకూడదని, సైలెంట్‌ మోదీ నుంచి బోల్‌ మోదీలాగా మారాలన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో  మోసగాడి కొత్త మంత్రం పారిపోవడం, ఎగిరిపోవడమేనని చెప్పారు. 

ఆర్‌టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన సమాచారంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ముంబైలోనే రూ.19,317 కోట్ల మోసాలు, స్కాంలు చోటు చేసుకున్నాయని తెలిపారు. 2015లో రూ.5,560.66 కోట్లు, 2016లో రూ.4,273.87 కోట్లు, 2017లో ఉరూ.9,838.66 కోట్లు కుంభకోణాలు జరిగాయని సుర్జేవాలా చెప్పారు. ఈ స్కామ్‌లు, మోసాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 189 మంది తప్పించుకున్నారని ఆరోపించారు. మోదీ, ఫడ్నవీస్‌ ప్రభుత్వాలు దోపిడీలకు వన్‌-వే టిక్కెట్‌ లాంటివని చెప్పారు. ఈ ఆరోపణలు బీజేపీ ఖండిస్తోంది. కాంగ్రెస్‌ హయాంలోనే ఈ మోసాలు జరిగినట్టు ఆరోపణలను తిప్పికొడుతోంది. 
 

>
మరిన్ని వార్తలు