చిక్కులో మరో టాప్‌ బ్యాంకర్‌

20 Jun, 2018 15:58 IST|Sakshi

పుణే : వీడియోకాన్‌ రుణ వివాద కేసులో ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో, ఎండీ అయిన చందాకొచర్‌ తీవ్ర ఇరకాటంలో పడగా.. మరో టాప్‌ బ్యాంకర్‌ కూడా చిక్కుల్లో కూరుకున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర సీఈఓ, ఎండీ రవీంద్ర మరాథేను ఆర్థిక నేరాల వింగ్‌ అరెస్ట్‌ చేసింది. రూ.3 వేల కోట్ల డీఎస్‌కే గ్రూప్‌ రుణ ఎగవేత కేసులో రవీంద్ర మరాథేతో పాటు బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌కే గుప్తాను  ఆర్థిక నేరాల వింగ్‌ అదుపులోకి తీసుకుంది. ఈ రుణ ఎగవేత కేసుతో సంబంధం ఉన్న జైపూర్‌కు చెందిన బ్యాంక్‌ మాజీ సీఎండీ సుశిల్‌ మునోట్‌ కూడా పట్టుబడ్డారు. అరెస్ట్‌ అయిన ఈ ముగ్గురిపై చీటింగ్‌, ఫోర్జరీ నేర కుట్ర, నమ్మకాన్ని ఒమ్ము చేయడం వంటి వాటిపై కేసు బుక్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. డీఎస్‌కే గ్రూప్‌తో కలిసి ఈ అధికారులు, మోసపూరిత లావాదేవీలు చేశారని పుణేకు చెందిన ఆర్థిక నేరాల వింగ్‌ ఆరోపిస్తోంది. 

4వేల మంది ఇన్వెస్టర్లను రూ.1,154 కోట్లకు మోసం చేసినందుకు గాను, పుణేకు చెందిన డీఎస్‌ కులకర్ని, అతని భార్య హేమంతీని ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్‌ చేశారు. అంతేకాక రూ.2,892 కోట్ల రుణాలను కూడా వీరు దారి మళ్లించినట్టు తెలిసింది. డీఎస్‌కే డెవలపర్స్‌ లిమిటెడ్‌తో కలిసి బ్యాంక్‌ అధికారులు, వారి అధికారాన్ని, అథారిటీని దుర్వినియోగం చేశారని ఆర్థిక నేరాల వింగ్‌ ఆరోపిస్తోంది. రుణాలను మోసపూరిత ఉద్దేశ్యంతో జారీచేశారని, రద్దు చేసిన రుణాలను వీరు వారికి మంజూరు చేశారని పేర్కొంది. 

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు చెందిన మాజీ, ప్రస్తుత అధికారులు మాత్రమే కాక, డీఎస్‌కే గ్రూప్‌కు చెందిన ఇ‍ద్దరు వ్యక్తులను కూడా ఆర్థిక నేరాల వింగ్‌ అదుపులోకి తీసుకుంది. డీఎస్‌కే గ్రూప్‌ సీఏ సునిల్‌ ఘట్పాండే, ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ నేవాస్కర్‌ను, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర జోనల్‌ మేనేజర్‌ నిత్యానంద్‌ను ఆర్థిక నేరాల వింగ్‌ అరెస్ట్‌ చేసింది. గత నెలలోనే కులకర్ని, ఆయన భార్య, డీఎస్‌కే గ్రూప్‌కు చెందిన ఇతర అధికారుల 124 ప్రాపర్టీలను, 276 బ్యాంక్‌ అకౌంట్లను, 46 వాహనాలను మహారాష్ట్ర ప్రభుత్వం అటాచ్‌ చేస్తున్నట్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  
 

మరిన్ని వార్తలు