ఖాతాదారులూ! కాస్త జాగ్రత్త!!

19 Dec, 2019 01:03 IST|Sakshi

సైబర్‌ నేరాల కట్టడిపై బీవోఐ చైర్మన్‌ పద్మనాభన్‌ వ్యాఖ్య

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సైబర్‌ నేరాలను కట్టడి చేసేందుకు బ్యాంకులు, నియంత్రణ సంస్థ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఖాతాదారులు కూడా తమ వంతుగా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీవోఐ) నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జి.పద్మనాభన్‌ అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించి అసలైన పోర్టల్స్, యాప్స్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్లను ఉపయోగించడంతో పాటు పిన్‌ నంబర్లు లాంటివి ఎవరికీ వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే, సైబర్‌ సెక్యూరిటీ అనేది ఏ ఒక్క సంస్థ బాధ్యతో కాదని.. ఈ విషయంలో ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, వివిధ ఏజెన్సీలు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. బుధవారమిక్కడ ఐడీఆర్‌బీటీలో.. ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ సెక్యూరిటీపై 15వ అంతర్జాతీయ సదస్సు (ఐసీఐఎస్‌ఎస్‌) ప్రారంభించిన సందర్భంగా పద్మనాభన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సు 20 దాకా జరగనుంది.

అత్యధికంగా సైబర్‌ దాడులకు గురయ్యే దేశాల్లో అమెరికా తర్వాత భారత్‌ రెండో స్థానంలో ఉందని పద్మనాభన్‌ చెప్పారు. ‘‘కానీ సైబర్‌ దాడులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండే విషయంలో మాత్రం 47వ స్థానంలో ఉన్నాం. ఆర్థిక సేవలను సులభంగా అందించేందుకు, లావాదేవీల ఖర్చు భారీగా తగ్గించేందుకు సైబర్‌ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. సాధారణంగా నెట్‌వర్క్‌లోకి చొరబడిన వైరస్‌ తీవ్రత 220 రోజులకు గానీ బయటపడటం లేదు. దీన్ని మరింత ముందుగా గుర్తించగలిగితే సైబర్‌ దాడులను కొంతైనా నియంత్రించవచ్చు’’ అని ఆయన వివరించారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ(ఐడీఆర్‌బీటీ) దీనికి తగు టెక్నాలజీని రూపొందించడంపై దృష్టి పెట్టా లన్నారు. బ్యాంకింగ్‌ టెక్నాలజీకి సంబంధిం చి ఫిన్‌టెక్‌ ఎక్సే్చంజీ, 5జీ యూజ్‌ కేస్‌ ల్యాబ్‌ మొదలైనవి ఏర్పాటు వంటి అంశాలను ఐడీఆర్‌బీటీ డైరెక్టర్‌ ఏఎస్‌ రామశాస్త్రి వివరించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా