‘గరీబ్‌ కల్యాణ్‌’తో ప్రయోజనాలు

30 Dec, 2016 01:26 IST|Sakshi
‘గరీబ్‌ కల్యాణ్‌’తో ప్రయోజనాలు

తాజా ఆదాయ వెల్లడి స్కీమ్‌పై బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా విశ్లేషణ
ద్రవ్యలోటు కట్టడికి దోహదపడుతుందని అంచనా


న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన రెండవ విడత స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్‌ 2) ద్వారా ప్రభుత్వం లక్షించిన రూ.లక్ష కోట్లు లభిస్తే ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేకూర్చుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ (బీఓఎఫ్‌ఏ–ఎంఎల్‌) విశ్లేషించింది. ఐడీఎస్‌ 2 ద్వారా రూ. లక్ష కోట్లు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంటూ, ఈ మొత్తం వస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు– చేసే వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) కట్టడికి ఇది ఎంతో దోహదపడే అంశంగా పేర్కొంది. ముఖ్యంగా ఏడవ వేతన కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగా ఫండింగ్, బ్యాంకులకు మరింత మూలధం అందజేయడం వంటి అంశాల కోణంలో ఐడీఎస్‌ 2 ద్వారా లభించే ఆదాయం దోహదపడుతుందని బీఓఎఫ్‌ఏ అంచనావేసింది.

కొత్త పథకం ఇదీ...
ఐడీఎస్‌ 2 పథకాన్ని కేంద్రం డిసెంబర్‌ 16న ప్రకటించింది. మార్చి 31 వరకూ ఈ పథకం అమల్లో ఉంటుంది.  దీని ప్రకారం పథకానికి దరఖాస్తు పెట్టుకునే ముందే ‘వెల్లడి మొత్తానికి’ సంబంధించిన మొత్తంలో మొదట 49.9 శాతం పన్ను చెల్లించాలి.  అలాగే ఈ దరఖాస్తుకు ముందే ‘వెల్లడి మొత్తం’లో  25 శాతాన్ని వడ్డీరహిత రీతిలో నాలుగేళ్ల కాలానికి ‘లాక్‌–ఇన్‌’ విధానంలో డిపాజిట్‌ చేయాలి. మిగిలిన 25 శాతాన్ని వెనక్కు తీసుకోవచ్చు.  అవినీతి, బినామీ ఆస్తుల నిర్వహణ, అక్రమ ధనార్జన, విదేశీ మారకద్రవ్య నిల్వల ఉల్లంఘనలు, ఫారిన్‌ బ్లాక్‌ మనీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ పథకం వర్తించదు.

>
మరిన్ని వార్తలు