మళ్లీ నష్టాల్లోకి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

23 May, 2017 00:00 IST|Sakshi
మళ్లీ నష్టాల్లోకి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

న్యూఢిల్లీ: వరుసగా రెండు క్వార్టర్లలో లాభాల్ని కనపర్చి, టర్న్‌ ఎరౌండ్‌ అయిన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మళ్లీ నష్టాల్లోకి జారిపోయింది. 2017 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 1,045 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో కనపర్చిన రూ. 3,587 కోట్ల నికరనష్టంతో పోలిస్తే తాజాగా ముగిసిన త్రైమాసికంలో నష్టాలు తగ్గినప్పటికీ, అంతక్రితం వరుసగా రెండు త్రైమాసికాల్లో (2016 సెప్టెంబర్, డిసెంబర్‌ క్వార్టర్లు) ఈ బ్యాంకు లాభాల్ని ఆర్జించగలిగింది.

 కానీ 2017 మార్చి త్రైమాసికంలో ఎన్‌పీఏలు రూ. 7,000 కోట్ల మేర పెరగ్గా, రూ. 3,983 కోట్ల బకాయిల్ని బ్యాంకు రైటాఫ్‌చేసింది. 2016 డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే మొండి బకాయిలు మూడు రెట్లు పెరిగాయి. దాంతో మార్చి క్వార్టర్‌లో నష్టాలు తప్పలేదు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి లాభాలేవీ లేనందున, సోమవారం సమావేశమైన బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఎటువంటి డివిడెండునూ సిఫార్సుచేయలేదు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ. 1,558 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఈ నష్టం రూ. 6,089 కోట్లు.

స్థూల ఎన్‌పీఏలు 13.22 శాతం...
మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎన్‌పీఏల శాతం 13.07 నుంచి 13.22కు పెరిగింది. నికర ఎన్‌పీఏలు మాత్రం 2016 మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 7.79 శాతం నుంచి 6.90 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం 8.8 శాతం పెరిగి రూ. 3,187 కోట్ల నుంచి రూ. 3,469 కోట్లకు పెరిగింది. బ్యాంకు ఇతర ఆదాయం రూ. 884 కోట్ల నుంచి భారీగా రూ. 1,754 కోట్లకు పెరిగింది.

ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు జాయింట్‌ వెంచర్‌ అయిన స్టార్‌ యూనియన్‌ దైచీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో 18 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 495 కోట్ల లాభం సంపాదించడం, సిబిల్‌లో వాటాను రూ. 188 కోట్లకు విక్రయించడం వంటి అంశాల కారణంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇతర ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు నష్టాల్ని పరిమితం చేసుకోగలిగింది. ఫలితాల నేపథ్యంలో ఈ షేరు 10 శాతంపైగా పతనమై రూ. 158 వద్ద ముగిసింది. 2015 ఆగస్టు తర్వాత ఈ షేరు ఒకే రోజులో ఇంతగా క్షీణించడం ఇదే ప్రధమం.

మరిన్ని వార్తలు