బ్యాంక్‌ షేర్ల భారీ పతనం

29 Jun, 2020 11:49 IST|Sakshi

2.50శాతానికి పైగా నష్టపోయిన బ్యాంక్‌ నిఫ్టీ

మార్కెట్‌ క్షీణతలో భాగంగా సోమవారం ఉదయం సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2.50శాతానికి పైగా నష్టపోయింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ఒక సమవేశంలో మాట్లాడుతూ  ‘‘బ్యాంకుల రుణాల వన్‌టైమ్‌ రీకన్‌స్ట్రక్చన్‌ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాము.’’ అని వ్యాఖ్యానించారు. కార్పోరేట్‌ రుణాలు మెండిబకాయిలు(ఎన్‌పీఏ)గా మారేందుకు ప్రస్తుతం ఉన్న గడువును 90రోజుల నుంచి 120రోజులు లేదా 150రోజులకు పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు  శుక్రవారం జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో ఆర్‌బీఐ ఛైర్మన్‌ శక్తికాంత్‌ దాస్‌ బోర్డు సభ్యులకు తెలిపినట్లు సమాచారం. 

రుణాల పునర్‌వ్యవస్థీకరణ, ఎన్‌పీఎల గడువు పెంపు వంటి అంశాలు అమల్లోకి వస్తే బ్యాంకు రుణాల చెల్లింపులు ఆలస్యం కావడంతో పాటు మొండిబకాయిలు మరింత పెరగవచ్చనే అందోళనలు ఇన్వెస్టర్లలో మొదలయ్యాయి. ఫలితంగా నేడు ప్రైవేట్‌ బ్యాంక్‌లతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఉదయం గం.11:15ని.లకు ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2.33శాతం నష్టపోయి 21,088 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇదే ఇండెక్స్‌లో అత్యధికంగా ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 6శాతం నష్టపోయింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 5.50శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌ షేర్లు 4శాతం నష్టపోయాయి. పీఎన్‌బీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం క్షీణించాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల 2శాతం నుంచి 1శాతం పతనమయ్యాయి. 

మరిన్ని వార్తలు