జెట్‌ను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలి

20 Apr, 2019 04:56 IST|Sakshi

22,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు చూడాలి

బ్యాంకులపై భారం మోపొద్దు

ప్రధానికి బ్యాంకు ఉద్యోగుల సంఘం అభ్యర్థన

జెట్‌ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలపై దర్యాప్తునకు డిమాండ్‌

ముంబై: నిధుల సంక్షోభంతో కార్యకలాపాలు నిలిచిపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, 22,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఇది అవసరమని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి సూచించాయి. దెబ్బతిన్న విమానయాన సంస్థకు మరిన్ని నిధులిచ్చే దిశగా బ్యాంకులను ఒత్తిడి చేయకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధానికి రాసిన లేఖలో ఆల్‌ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) పేర్కొంది. జెట్‌ కార్యకలాపాలపై దర్యాప్తు చేయాలని కోరింది. తాజాగా నిధులిచ్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ‘‘జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు బ్యాంకులు బిడ్లను ఆహ్వానించాయని తెలిసింది. ఒకవేళ ఇది సఫలం కాకపోతే జెట్‌ ఎయిర్‌వేస్‌ను మీరే స్వాధీనం చేసుకోవాలి. దాంతో 22,000 మంది ఉద్యోగాలు భద్రంగా ఉంటాయి’’ అని ఏఐబీఈఏ లేఖలో కోరింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు తాజా నిధుల సాయం చేయాలని బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావడాన్ని కూడా వ్యతిరేకించింది. బ్యాంకులు యజమానులు కావడంతో ప్రతి ఒక్కరూ జెట్‌ బెయిలవుట్‌ కోసం వాటివైపే చూస్తున్నారని పేర్కొంది. ‘‘నరేష్‌ గోయల్‌ ఇప్పటికీ సంస్థ ప్రమోటర్‌గా 51 శాతం వాటా కలిగి ఉన్నారు. కంపెనీని నడిపించడమా లేక వేరొకరికి అమ్మేయడమా అన్నది అతని సమస్య’’ అని ఏఐబీఈఏ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం మొత్తానికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి నరేష్‌ గోయల్‌ అని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేసింది.

మరిన్ని వార్తలు