బ్యాంకింగ్ ఫిర్యాదులు పెరిగాయ్

26 Jul, 2016 00:33 IST|Sakshi
బ్యాంకింగ్ ఫిర్యాదులు పెరిగాయ్

ఆర్‌బీఐ కార్యక్రమాలు ఫలితాన్నిస్తున్నాయి
ఎస్‌బీఐపైనే ఫిర్యాదులెక్కువ: అంబుడ్స్‌మన్ కృష్ణమోహన్

 సాక్షి, హైదరాబాద్: బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌పై చైతన్యం పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అంబుడ్స్‌మన్, ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎన్.కృష్ణమోహన్ చెప్పారు. సంప్రదింపులు, సలహాల ద్వారా ఫిర్యాదుల్ని పరిష్కరించటంలో అంబుడ్స్‌మన్ క్రియాశీల పాత్ర పోషిస్తోందన్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. గత ఏడాదికి సంబంధించి అంబుడ్స్‌మన్ పురోగతిని వెల్లడించారు. 2014-15తో పోలిస్తే 2015-16లో అంబుడ్స్‌మన్‌కు వచ్చిన ఫిర్యాదులు 35.36 శాతం మేర  పెరిగాయన్నారు. ‘‘మొత్తం 5910 ఫిర్యాదులు అందాయి.

వీటిలో 2801 ఏపీ నుంచి, 3109 తెలంగాణ నుంచి వచ్చాయి. వీటిలో 94.41 శాతం ఫిర్యాదులు ఇప్పటికే పరిష్కరించాం. సలహాలు, సూచనలు, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాం. 2015-16 ఫిర్యాదుల్లో అత్యధికంగా ఎస్‌బీఐకి చెందినవి 26.2 శాతం, అనుబంధ బ్యాంకులవి 9% ఉన్నాయి. ఎస్‌బీఐ కార్డులకు సంబంధించి 3.8 శాతం ఫిర్యాదులొచ్చాయి’’ అని వివరించారు. గతంతో పోలిస్తే నగరాల్లో ఫిర్యాదులు ఒక శాతం తగ్గుముఖం పట్టగా.. పట్టణాల్లో 32 నుంచి 37 శాతానికి పెరిగాయన్నారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలకు చెందినవి 27 శాతం మేరకు ఉన్నాయన్నారు. మొత్తం ఫిర్యాదుల్లో ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డులకు చెందినవే 25.5 శాతం ఉన్నాయన్నారు. అంబుడ్స్‌మన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్, వరంగల్, వివిధ జిల్లా కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు, పాఠశాలలు, విద్యాలయాల్లో ఆర్థిక అవగాహన సదస్సులు, బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించినట్లు కృష్ణమోహన్ చెప్పారు.

మరిన్ని వార్తలు