ఆర్‌బీఐ పాలసీ ముందు అమ్మకాలు

30 Jul, 2013 04:44 IST|Sakshi
ఆర్‌బీఐ పాలసీ ముందు అమ్మకాలు

రిజర్వుబ్యాంక్ పరపతి విధానం మంగళవారం వెల్లడికానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొన్ని రంగాలకు చెందిన షేర్లను విక్రయించడంతో  స్టాక్ సూచీలు మూడు వారాల కనిష్టస్థాయి వద్ద ముగిసాయి. సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 155 పాయింట్లు క్షీణించి 19,593 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 55 పాయింట్ల తగ్గుదలతో 5,831 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఆసియా మార్కెట్లు కూడా బలహీనంగా ట్రేడ్‌కావడం ఇక్కడి సెంటిమెంట్‌ను బలహీనపర్చింది. బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగడంతో హెచ్‌యూఎల్ 3.5 శాతం, ఐటీసీ 2.5 శాతం చొప్పున తగ్గాయి. ఈ రెండు షేర్లే సెన్సెక్స్‌లో 100 పాయింట్ల క్షీణతకు కారణం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, హిందాల్కో, సేసాగోవా, ఐడీఎఫ్‌సీ షేర్లు కూడా సూచీలను నష్టపర్చాయి. ప్రధాన ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రాలు ర్యాలీ జరిపాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 231 కోట్ల విలువైన నికర అమ్మకాలు జరపగా, దేశీయ సంస్థలు రూ. 100 కోట్ల నికరంగా విక్రయించాయి.
 
 అంతంతమాత్రంగానే క్రయవిక్రయాలు...
 రిజర్వుబ్యాంక్ పాలసీ ప్రకటన పట్ల ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నిర్లిప్తంగా వున్నట్లు నిఫ్టీ ఆప్షన్ డేటా వెల్లడిస్తోంది. ఏదైనా ముఖ్య సంఘటన జరిగేముందు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు వారివారి అంచనాలకు అనుగుణంగా ఫ్యూచర్ పొజిషన్ల బదులు రిస్క్ తక్కువగా వుండే ఆప్షన్లను ఆశ్రయిస్తుంటారు. సోమవారం ట్రేడింగ్ సందర్భంగా నిఫ్టీలో ఆ బిల్డప్ అంతంతమాత్రంగానే జరిగింది. 5,900, 6,000 స్ట్రయిక్స్ కాల్ ఆప్షన్లలో స్వల్పంగా రైటింగ్ జరగడంతో బిల్డప్ 38 లక్షలు, 48 లక్షల షేర్లకు మాత్రమే పెరిగింది. 5,900, 5,800 స్ట్రయిక్స్ పుట్ ఆప్షన్లలో కూడా అంతంతమాత్రంగానే 42 లక్షలు, 48 లక్షల షేర్ల చొప్పునే బిల్డప్ వుంది. మంగళవారం పాలసీ వెల్లడి తర్వాత ఎటు బిల్డప్ పెరిగితే, వ్యతిరేకదిశగా సూచీలు వేగంగా కదలవచ్చు. బిల్డప్ సోమవారంలానే అంతంతమాత్రంగా వుంటే పరిమితశ్రేణిలో నిఫ్టీ కదలవచ్చన్నది డేటా విశ్లేషణ.
 
 అదే తరహాలో బ్యాంక్ నిఫ్టీ...
 ఆర్‌బీఐ బ్యాంక్ రేటును అనూహ్యంగా పెంచిన తర్వాత రెండు వారాల నుంచి 12 శాతంపైగా నష్టపోయిన బ్యాంక్ నిఫ్టీలో మంగళవారం జరిగిన బిల్డప్ కూడా అల్పంగానే వుంది. 10,000 స్ట్రయిక్ పుట్ ఆప్షన్లోనూ, 11,000 స్ట్రయిక్ కాల్ ఆప్షన్లో మాత్రం తాజా రైటింగ్ జరిగింది. ఈ రైటింగ్ ఫలితంగా 11,000 కాల్ ఆప్షన్లో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 2,61 లక్షల షేర్లకు చేరగా, 10,000 పుట్ ఆప్షన్లో ఓఐ 3.34 లక్షల షేర్లకు చేరింది. సమీప భవిష్యత్తులో ఈ రెండు స్థాయిల మధ్య బ్యాంక్ నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనుకావచ్చన్నది డేటా సంకేతం.

మరిన్ని వార్తలు