31 నుంచి బ్యాంకింగ్‌ రెండు రోజుల సమ్మె!

28 Jan, 2020 08:24 IST|Sakshi
ఐబీపీఏఆర్‌ఏ (ఏపీఅండ్‌టీఎస్‌) సమావేశం...

న్యూఢిల్లీ: వేతన సవరణకు తక్షణ చర్యలు చేపట్టాలన్న ప్రధాన డిమాండ్‌తో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో బ్యాంక్‌ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నాయి. 9 బ్యాంక్‌ యూని యన్ల ఐక్య వేదిక యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఇచ్చిన పిలుపుతో ఉద్యోగులు ఈ సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ ఐక్య వేదికలో అఖిల భారత బ్యాంక్‌ ఆఫీసర్ల సమాఖ్య (ఏఐబీఓసీ), అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), బ్యాంక్‌ కార్మి కుల జాతీయ సంఘం (ఎన్‌ఓబీడబ్ల్యూ) వంటివి ఉన్నాయి. సమస్యల పరిష్కార దిశలో చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ ముందు జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదని, దీనితో యూనియన్లు సమ్మె నోటీసును వెనక్కు తీసుకోలేదని ఏఐబీఓసీ ప్రెసిడెండ్‌ సునిల్‌ కుమార్‌ తెలిపారు. యూనియన్ల నుంచి డిమాండ్లపై ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) నుంచి కూడా ఎటువంటి హామీ రాలేదని ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు.

మా సమస్యలూ పరిష్కరించాలి:ఐబీపీఏఆర్‌ఏ (ఏపీఅండ్‌టీఎస్‌)
బ్యాంకింగ్‌ సమ్మె నేపథ్యంలో ఇండియన్‌ బ్యాంక్‌ పెన్షనర్లు అండ్‌ రిటైరీస్‌ అసోసియేషన్‌ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణా) ఐదవ ద్వైవార్షిక సమావేశం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. తమ సమస్యల పరిష్కారానికి, తగిన గౌరవప్రదమైన పెన్షన్‌ పొందడానికి ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని, ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలని సమావేశం నిర్ణయించింది.

>
మరిన్ని వార్తలు