బ్యాంకింగ్‌ దన్ను- డోజోన్స్‌కు జోష్‌

28 May, 2020 10:40 IST|Sakshi

మూడో రోజూ యూఎస్‌ మార్కెట్లు అప్‌

డోజోన్స్‌ 553 పాయింట్లు అప్‌

11 వారాల గరిష్టానికి ఎస్‌అండ్‌పీ

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ జోరు

2 రోజుల్లో బ్యాంక్‌ ఇండెక్స్‌ 10 శాతం జూమ్‌

ప్రధానంగా బ్యాంకింగ్‌ స్టాక్స్‌కు డిమాండ్‌ పెరగడం, ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందన్న అంచనాలు బుధవారం యూఎస్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో డోజోన్స్‌ 553 పాయింట్లు(2.2 శాతం) జంప్‌చేసి 25,548 వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 44 పాయింట్లు(1.5 శాతం) బలపడి 3,036 వద్ద నిలవగా.. నాస్‌డాక్‌ 72 పాయింట్లు(0.8 శాతం) పుంజుకుని 9,412 వద్ద స్థిరపడింది. మార్చి 5 తదుపరి ఎస్‌అండ్‌పీ 3,000 పాయింట్ల ఎగువన ముగియడం గమనార్హం! పలు రాష్ట్రాలలో లాక్‌డవున్‌ ఎత్తివేస్తున్న కారణంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కనున్న అంచనాలు పెరిగినట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఇటీవల కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్‌ అభివృద్ధిలో పలు కంపెనీలు ముందడుగు వేయడం కూడా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. అయితే చైనాతో వాణిజ్య వివాదాలు ఇన్వెస్టర్లలో అంతర్గతంగా ఆందోళనలకు కారణమవుతున్నట్లు వివరించారు.

జేపీ మోర్గాన్‌ ప్లస్‌
బ్యాంకింగ్‌ దిగ్గజాలలో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ 7 శాతం చొప్పున దూసుకెళ్లగా.. జేపీ మోర్గాన్‌ చేజ్‌ దాదాపు 6 శాతం జంప్‌చేసింది. రెండో క్వార్టర్‌లో క్రెడిట్‌ రిజర్వ్‌లను పెంచుకోనున్నట్లు బ్యాంక్‌ సీఈవో జేమీ డైమన్‌ పేర్కొనడంతో వరుసగా రెండో రోజు ఈ కౌంటర్‌ జోరందుకుంది. ఈ బాటలో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ సైతం పుంజుకోవడంతో బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ రెండు రోజుల్లో 10 శాతం ఎగసింది. కాగా.. లాక్‌డవున్‌ ఎత్తివేయడంతో ఫ్లోరిడాలోని డిస్నీ వరల్డ్‌ థీమ్‌ పార్క్‌ను జులై 11 నుంచి దశల వారీగా ప్రారంభించనున్నట్లు వాల్ట్‌ డిస్నీ వెల్లడించింది. ఈ బాటలో లాస్‌వెగాస్‌లోని నాలుగు క్యాసినోలను జూన్‌ 4 నుంచీ తిరిగి తెరవనున్ననట్లు ఎంజీఎం రిసార్ట్స్‌ పేర్కొంది. దీంతో ఈ షేరు 2.6 శాతం పుంజుకుంది. ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌లో 7 షేర్లు 52 వారాల గరిష్టాలను తాకగా.. నాస్‌డాక్‌ కంపెనీలలో 41 కొత్త గరిష్టాలను అందుకున్నాయి. అయితే మరో 10 కంపెనీలు కొత్త కనిష్టాలకు చేరాయి.

ఇతర కౌంటర్లూ
లాక్‌డవున్‌ ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఇటీవల అమ్మకాలతో దెబ్బతిన్న కౌంటర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. క్రూయిజ్‌ నిర్వాహక కంపెనీ కార్నివాల్‌ కార్ప్‌  6 శాతం జంప్‌చేయగా.. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ 4 శాతం పుంజుకుంది. జీఈ లైటింగ్‌ బిజినెస్‌ విక్రయ నేపథ్యంలో జనరల్‌ ఎలక్ట్రిక్‌ 7 శాతం పెరిగింది. హెచ్‌బీవో మ్యాక్స్‌ సర్వీసులను ప్రారంభించడంతో ఏటీఅండ్‌టీ 4 శాతం ఎగసింది. ట్రాక్టర్ల కంపెనీ టీఎస్‌సీవో 8 శాతం జంప్‌చేయగా.. ట్రంప్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ట్విటర్‌ మాత్రం 3 శాతం పతనమైంది.

మరిన్ని వార్తలు