మొండిబాకీలు మరింత పెరుగుతాయ్‌..

6 Jun, 2018 00:20 IST|Sakshi

ఈ ఆర్థిక సంవత్సరంలో 11.5 శాతానికి చేరవచ్చు

ప్రస్తుతం 11.2 శాతం

రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ నివేదిక

ముంబై: దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థలో స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 11.5 శాతానికి చేరొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 11.2 శాతంగా ఉన్నాయి. 2017 మార్చి 31తో ముగిసిన సంవత్సరంలో రూ. 8 లక్షల కోట్లుగా (ఇచ్చిన రుణాల్లో 9.5 శాతం)గా ఉన్న జీఎన్‌పీఏలు గత ఆర్థిక సంవత్సరంలో 10.3 లక్షల కోట్లకు (11.2 శాతం) చేరాయి.

ఈసారి 11.5 శాతానికి చేరిన తర్వాత నుంచి జీఎన్‌పీఏలు క్రమంగా తగ్గుముఖం పట్టగలవని క్రిసిల్‌ పేర్కొంది. మొండిబాకీలు, ప్రొవిజనింగ్‌ వ్యయాలు భారీగా ఎగియడంతో గత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఏకంగా రూ. 40,000 కోట్ల పైచిలుకు నష్టాలు నమోదయ్యాయి. దివాలా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఫిబ్రవరిలో రిజర్వ్‌ బ్యాంక్‌ వివిధ రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకాలను ఉపసంహరించడం కూడా.. మొండిబాకీల్లో అయిదో వంతుకు కారణమయ్యాయని క్రిసిల్‌ వివరించింది.

మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) .. బాసెల్‌ త్రీ నిబంధనలను పాటించాలంటే అదనపు మూలధనం కోసం కేంద్రంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి రావొచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం నష్టాలు ఊహించిన దానికి మించిన నేపథ్యంలో.. కేంద్రం ప్రకటించిన రూ. 2.1 లక్షల కోట్ల అదనపు మూలధనం నిధులు పీఎస్‌బీల అవసరాలకు సరిపోకపోవచ్చని క్రిసిల్‌ తెలిపింది.  

తగ్గనున్న ఎన్‌పీఏలు..
ఎన్‌పీఏల పెరుగుదల గరిష్ట స్థాయికి చేరిందని, ఇక   మెల్లగా తగ్గుముఖం పట్టవచ్చనేది క్రిసిల్‌ అంచనా. ఎన్‌పీఏల నుంచి రికవరీలు మెరుగ్గా ఉండటం, ప్రొవిజనింగ్‌ తగ్గే అవకాశాలు మొదలైనవి బ్యాంకులకు సానుకూలాంశాలుగా పేర్కొంది. స్పెషల్‌ మెన్షన్‌ అకౌంట్‌2 కింద వర్గీకరించిన 60–90 రోజుల మేర బకాయిల పరిమాణం గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి సుమారు సగం తగ్గి 0.8%కి చేరింది.

అంతక్రితం ఏడాది ఇది 2 శాతంగా నమోదైంది. ఎన్‌పీఏలుగా మారే అవకాశాలు ఉన్న రుణాలు తగ్గుతున్నాయనడాన్ని తాజా పరిణామం సూచిస్తోందని క్రిసిల్‌ తెలిపింది. ఇక, నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) విచారణ జరుపుతున్న మొండి బాకీ కేసుల నుంచి కూడా బ్యాంకులకు మెరుగ్గానే రికవరీ కాగలదని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ కృష్ణన్‌ సీతారామన్‌ తెలిపారు.

ఎన్‌సీఎల్‌టీ ముందున్న మొత్తం 3.3 లక్షల కోట్ల రుణాలకు సంబంధించిన కేసుల్లో సుమారు పావు వంతు కేసులు ఉక్కు సంస్థలవే ఉన్నాయి. ఉక్కు రంగం పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో వేలంలో ఈ సంస్థలపై మంచి ఆసక్తి వ్యక్తమవుతుండటం సానుకూల అంశమని కృష్ణన్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు