ముద్రా రుణాలను జాగ్రత్తగా పరిశీలించాలి

26 Nov, 2019 21:00 IST|Sakshi

ముద్ర రుణాల్లో పెరుగుతున్న మొండిబకాయిలపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) కింద అనధికారిక రుణాలను విస్తరిస్తున్న బ్యాంకులు ఈ రుణాలను మరింత అప్రమత్తంగా పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ ఎం.కె.జైన్‌ సూచించారు. ముద్రా పథకం కింద ఇచ్చిన రుణాలను ప్రస్తావిస్తూ  బ్యాంకులు మదింపు దశలో రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యంపై దృష్టి పెట్టాలి, జాగ్రత్తగా పర్యవేక్షించాలన్నారు. 

ముద్ర రుణాల ద్వారా చాలా కుటుంబాలను పేదరికంనుంచి బయటకు తెచ్చేందుకు చేసిన  ప్రయత్నం. కానీ మొండిబకాయిలు పెరిగిపోతున్నాయని జైన్‌  వ్యాఖ్యానించారు.  వీరికి రుణాలు ఇచ్చేసమయంలోనే బ్యాంకులు రీపేమెంట్‌కు సంబంధించి సరైన అంచనాలు వేసుకోవాలన్నారు. 

కాగా కార్పొరేట్‌యేతర, వ్యవసాయేతర చిన్న,సూక్ష్మ సంస్థలకు  రూ .10 లక్షల వరకు రుణాలు అందించడానికి పిఎంఎంవై 2015, ఏప్రిల్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఈ పథకం కింద ఎస్సీలు, ఎస్టీలు సహా 3.27 కోట్ల మంది స్వల్ప, చిన్న పారిశ్రామికవేత్తలకు రూ .7.28 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు డేటా ద్వారా తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు