ఇక బ్యాంకుల చెంతనే ‘అంబుడ్స్‌మన్‌’

4 Sep, 2018 01:00 IST|Sakshi

ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ఆర్‌బీఐ ఆదేశాలు...

ముంబై: బ్యాంకు ఖాతాదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. 10 బ్రాంచ్‌లకు మించి కార్యకలాపాలున్న వాణిజ్య బ్యాంకులన్నీ ఇకపై కచ్చితంగా అంతర్గత అంబుడ్స్‌మన్‌ను (ఐఓ) నియమించుకోవాలని సోమవారం ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే, దీని నుంచి రీజినల్‌ రూరల్‌ బ్యాంక్స్‌కు (ఆర్‌ఆర్‌బీ) మినహాయింపునిచ్చింది. ‘అంతర్గత అంబుడ్స్‌మన్‌కు మరిన్ని స్వతంత్ర అధికారాలను కల్పించడం, ఐఓ యంత్రాంగం విధి నిర్వహణ తీరుపై పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకుగాను ‘అంతర్గత అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌–2018’ పేరుతో తాజా చర్యలను చేపట్టినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

బ్యాంకు సేవల్లో లోటుపాట్లపై కస్టమర్ల ఫిర్యాదులను(పాక్షికంగా లేదా పూర్తిగా తిరస్కరణకు గురైనవి) ఓఐ పరిశీలించి తగిన పరిష్కారాన్ని చూపుతారని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఓఐ నియామకం, పదవీకాలం, బాధ్యతలు, విధులు, విధానపరమైన నిబంధనలు, పర్యవేక్షణ యంత్రాంగం వంటివన్నీ ఈ స్కీమ్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది.దీని అమలును ఆర్‌బీఐతో పాటు బ్యాంకుల అంతర్గత ఆడిట్‌ యంత్రాంగం కూడా పర్యవేక్షిస్తుంది. కాగా, ఫిర్యాదులపై 30 రోజుల్లోగా తగిన పరిష్కారాన్ని చూపని బ్యాంకులపై ప్రస్తుతం ఆర్‌బీఐ నియమించిన అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించే అవకాశం కస్టమర్లకు ఉంది. దేశవ్యాప్తంగా 15 చోట్ల ఈ బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ కార్యాలయాలున్నాయి.
 

మరిన్ని వార్తలు