1.16 లక్షల కోట్ల రికవరీపై చేతులెత్తేసిన బ్యాంకులు

23 Jan, 2019 09:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 16 బ్యాంకులు కలిసి పేరుకుపోయిన రూ 1.16 లక్షల కోట్ల రుణ బకాయిలను రాబట్టలేక చేతులెత్తేశాయి. డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌, దివాలా చట్టం 2016 వంటి పలు యంత్రాంగాల ద్వారా ఈ రుణ మొత్తాలను వసూలు చేయలేకపోయిన బ్యాంకులు చివరి అస్త్రంగా వీటిని అసెట్‌ రీకన్‌స్ర్టక్షన్‌ కంపెనీ (ఏఆర్‌సీ)లకు అమ్ముకుని చేతులు దులుపుకున్నాయి.

రుణాలను వేగంగా రికవరీ చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా తీసుకువచ్చిన దివాలా చట్టం 2016 కింద రుణ రికవరీ ప్రక్రియ జాప్యం జరుగుతుండటంతో బ్యాంకులు మొండి బకాయిలను తెగనమ్మి బ్యాలెన్స్‌ షీట్లను ప్రక్షాళన చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నాయి. గత వారం ఎస్‌బీఐ ఎస్సార్‌ స్టీల్‌కు ఇచ్చిన రూ 15,000 కోట్ల రుణాలను 18 శాతం రాయితీతో విక్రయించి మార్కెట్‌ వర్గాలను విస్మయానికి లోనుచేసింది. డిస్కాంట్‌కు తాము రుణాలను విక్రయించినా బ్యాంకుకు రూ 9,500 కోట్ల నగదు లభించిందని, ఇది ఇతరులకు రుణాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలిగిస్తుందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు.

రుణాలు పేరుకుపోతే దానికి కేటాయింపులూ పెరుగుతాయని, మూలధనం ఎక్కువకాలం నిలిచిఉండటం మంచిదికాదని ఆయన చెప్పుకొచ్చారు. 62 ఖాతాలకు చెందిన రూ 27,953 కోట్ల రుణాలను ఎస్‌బీఐ వేలం ప్రక్రియలో అమ్మకానికి ఉంచింది. ఈ తరహా రుణాలను కొనుగోలు చేసేందుకు డచ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, హెడ్జ్‌ ఫండ్స్‌లు ఆసక్తి చూపుతున్నాయి. ఇక బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సైతం రూ 29,801 కోట్ల రుణాలను అమ్మకానికి పెట్టగా, కెనరా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, దేనా బ్యాంక్‌లూ నిరర్ధక ఆస్తుల విక్రయానికి మొగ్గుచూపుతున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా