బ్యాంకుల పరిస్థితి ప్రతికూలమే!

30 Oct, 2014 01:10 IST|Sakshi
బ్యాంకుల పరిస్థితి ప్రతికూలమే!

నెగిటివ్ అవుట్‌లుక్ కొనసాగిస్తున్నట్లు మూడీస్ ప్రకటన
* కార్పొరేట్ రుణ  బకాయిలే కారణం
ముంబై: భారత్ బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి ప్రతికూల అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ బుధవారం పేర్కొంది. కార్పొరేట్ అధిక రుణ బకాయిలే దీనికి కారణమనీ తెలిపింది. మొండి బకాయిల సమస్య పరిష్కారంలో ఇదొక ఇబ్బందికర అంశంగా ఉన్నట్లు విశ్లేషించింది.  భారత్ బ్యాంకింగ్ వ్యవస్థకు 2011 నవంబర్ నుంచీ మూడీస్ ‘నెగిటివ్ అవుట్‌లుక్’ను కొనసాగిస్తోంది.

దేశ ఆర్థిక వృద్ధి బాగున్నప్పటికీ బ్యాంకింగ్ రంగానికి కార్పొరేట్ మొండి బకాయిలు సవాలుగానే ఉన్నట్లు సింగపూర్ నుంచి జారీ చేసిన ఒక విశ్లేషణా పత్రంలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయపడింది. బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏ) 4.5 శాతానికి చేరుతున్నాయని నివేదిక పేర్కొంటూ, ఈ నేపథ్యంలో ప్రొవిజినింగ్స్‌ను కొనసాగిస్తూ, మూలధన పెట్టుబడులను మరింత పటిష్ట పరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ రుణాల్లో 70%కిపైగా వాటా కలిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ‘ప్రతికూల అంచనా’ ఉన్నట్లు మూడీస్ పేర్కొంది.

మొండిబకాయిలు పెరుగుతుండడం, అదే బాటలో రుణ పునర్‌వ్యవస్థీకరణలు, అలాగే లాభాలు తగ్గిపోతుండడం ఇత్యాధి సవాళ్లను ప్రైవేటు బ్యాంకులతో పోల్చితే ప్రభుత్వ బ్యాంకులే అధికంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఆయా బ్యాంకుల్లో ఈ సమస్యలను అధిగమించడం అంత తేలికైన వ్యవహారంగా కని పించడం లేదనీ విశ్లేషించింది. అయితే మరోవైపు ప్రభుత్వ బ్యాంకుల్లో మార్జిన్లు, నిల్వలు, మూలధన పెట్టుబడుల స్థాయిలు బాగుంటున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు