బ్యాంక్‌లకు, టెల్కోలకు ఆధార్‌ తప్పనిసరి చేయొచ్చు

6 Oct, 2018 20:37 IST|Sakshi

న్యూఢిల్లీ : బ్యాంక్‌లకు, మొబైల్‌ నెంబర్లకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం గత కొన్ని రోజుల క్రితం సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆధార్‌ అనుసంధానం అవసరం లేదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా అవి తప్పనిసరి చేయొచ్చు అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌ ఆమోదం పొందిన చట్టం ద్వారా మొబైల్‌ నెంబర్లకు, బ్యాంక్‌ అకౌంట్లకు ఆధార్‌ తప్పనిసరి చేయొచ్చు అని చెప్పారు. కానీ కొత్త చట్టం తీసుకొస్తున్నారా? లేదా? అన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. శనివారం జరిగిన హెచ్‌టీ నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడారు.

‘ఆధార్‌ అనేది పౌరసత్వ గుర్తింపు కార్డు కాదు’  అని జైట్లీ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందించే ఎన్నో సబ్సిడీలు, ఇతర సహాయాలకు ఇది ఉపయోగపడుతుంది. ఆధార్‌ అసలు ప్రయోజనం కూడా అదేనని తెలిపారు. ఆధార్‌ చేసే పనులను సుప్రీంకోర్టు కూడా సమర్థించిందన్నారు. ‘సుప్రీం ఇచ్చిన తీర్పు వెనుక ప్రధాన ఉద్దేశం ప్రైవేటు సంస్థలు ఆధార్‌ను ఉపయోగించకూడదనే. అయితే, సెక్షన్‌ 57 ప్రకారం చట్టం ద్వారా లేదా, ఏదైనా ఒప్పందం ప్రకారం తప్పనిసరిగా సమర్పించాలి. చట్టం ప్రకారం ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేయొచ్చు’’ అని అన్నారు. అయితే, అందుకు సంబంధించి పార్లమెంట్‌లో చట్టం తీసుకొచ్చే విషయంపై మాత్రం జైట్లీ ఏం చెప్పలేదు.

మరిన్ని వార్తలు