ఇక గ్యారంటర్ల ఫొటోలూ పత్రికల్లోకి..!

10 Jul, 2013 03:54 IST|Sakshi
rupee

న్యూఢిల్లీ:  రుణాల ఎగవేతదార్ల(డిఫాల్టర్ల)తోపాటు వాళ్లకు గ్యారంటర్లుగా ఉన్న వాళ్లకూ ఇక తిప్పలు తప్పవు!  ఈ మేరకు బ్యాంకులు మరిన్ని కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఒక్క డిఫాల్టర్ల ఫొటోలను మాత్రమే వార్తాపత్రికలకు ఎక్కించే ‘నేమ్ అండ్ షేమ్’ అస్త్రాన్ని బ్యాంకులు ప్రయోగిస్తూ వస్తున్నాయి. అదేవిధంగా తమ బ్రాంచీల్లోని నోటీసుబోర్డులు, కమ్యూనిటీ సెంటర్లలో కూడా ప్రదర్శిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్‌బీ)లు దీనికి నడుంబిగించాయి. ఇప్పుడు సంబంధిత డిఫాల్టర్ల రుణాలకు పూచీకత్తు ఇచ్చిన గ్యారంటర్లకు కూడా ఇదే విధానాన్ని అవలంబించాలని బ్యాంకులు నిర్ణయించాయి. పత్రికల్లో ఫొటోలను ప్రచురించడంతోపాటు డిఫాల్టర్లు, గ్యారంట్లర్ల ఇంటి చుట్టుపక్కల కూడా వాళ్ల చిత్రాలను ప్రదర్శించనున్నాయి. తద్వారా రుణ డీఫాల్టర్లపై మరింత ఒత్తిడి తెచ్చి బకాయిలను చెల్లించేలా చూడటమే ఈ ‘నేమ్ అండ్ షేమ్’ అస్త్రం ప్రధాన ఆశయం.
 
 రంగంలోకి అలహాబాద్ బ్యాంక్ ...: రుణ డీఫాల్టర్లకు చెందిన గ్యారంటర్లపై ‘నేమ్ అండ్ షేమ్’ అస్త్రాన్ని ప్రభుత్వరంగ అలహాబాద్ బ్యాంక్ ప్రయోగించింది. మంగళవారం   పత్రికల్లో ఒక బహిరంగ ప్రకటనను ప్రచురించింది. డిఫాల్ట్ రుణానికి తనఖా పెట్టిన రెండు ప్రాపర్టీలను విక్రయిచేందుకు ఈ నోటీసును జారీ చేసింది. ఇందులో ఇద్దరు గ్యారంటర్ల ఫొటోలున్నాయి.
 
 ఒక కార్పొరేట్ సంస్థ రూ.365 కోట్లకు పైగా రుణాన్ని అలహాబాద్ బ్యాంకుకు బకాయి పడింది. దీనికి ఇద్దరు వ్యక్తులు గ్యారంటర్స్‌గా ఉన్నారు. వీళ్లకు హర్యానా, ముంబైలలో ఉన్న ప్రాపర్టీలను తనఖాగా పెట్టారు. ఇప్పుడు రుణాన్ని తిరిగిచెల్లించడంలో విఫలంకావడంతో సంబంధిత కార్పొరేట్ సంస్థ గ్రూప్ పేరుతో పాటు గ్యారంటర్ల పేర్లను బ్యాంక్ ప్రచురించింది. కాగా, డీఫాల్టర్ల వివరాలను పేపర్లకు ఎక్కిస్తున్న వాటిలో ప్రభుత్వరంగ బ్యాంకులే అగ్రస్థానంలో ఉన్నాయి. అగ్రగామి ఎస్‌బీఐ, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లు ఈ జాబితాలో కొన్ని.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా