బ్యాంకులకు ‘కరోనా’ స్ట్రెస్‌ టెస్టులు

27 Jun, 2020 05:33 IST|Sakshi

మొండిబాకీలను గుర్తించేందుకే

ముంబై:  కరోనా వైరస్‌ పరిణామాలతో మందగమన పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో మొండిబాకీల స్థాయిని మదింపు చేసేందుకు బ్యాంకులు స్ట్రెస్‌ టెస్టులు నిర్వహించాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియేనని, ఆర్‌బీఐ ప్రత్యేకంగా బ్యాంకులకు ఆదేశాలివ్వాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆఖరు త్రైమాసికం కూడా ముగియడంతో ఆర్థికపరమైన ఒత్తిళ్ల గురించి ఒక అవగాహన కోసం ఈ సమీక్షల నిర్వహణ శ్రేయస్కరమని పేర్కొన్నాయి.

అసెట్‌ క్వాలిటీ దిగజారే అవకాశమున్న కేసులను ముందుగా గుర్తించేందుకు, ఒకవేళ పరిస్థితి చేయి దాటితే సమకూర్చుకోవాల్సిన మూలధనం తదితర అంశాలపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. దీనివల్ల మేనేజ్‌మెంట్‌కు, నియంత్రణ సంస్థకు ఆయా బ్యాంకుల ఆర్థిక స్థితిగతుల గురించి ముందస్తుగా ఒక అవగాహన ఉంటుంది. మొండిబాకీలను సకాలంలో గుర్తించడం ద్వారా మెరుగ్గా ఉన్న పద్దులపై ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు బ్యాంకులకు ఈ స్ట్రెస్‌ టెస్ట్‌ తోడ్పడుతుందని కేపీఎంజీ ఇండియా పార్ట్‌నర్‌ (ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అడ్వైజరీ) సంజయ్‌ దోషి తెలిపారు.  

బ్యాంకింగ్‌ వ్యవస్థ స్థాయిలో నెలకొన్న ఒత్తిళ్ల గురించి తెలియజేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఏటా రెండు సార్లు ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌) విడుదల చేస్తుంది. గతేడాది డిసెంబర్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019 సెప్టెంబర్‌లో 9.3 శాతంగా ఉన్న బ్యాంకుల స్థూల మొండిబాకీల నిష్పత్తి 2020 సెప్టెంబర్‌ నాటికి 9.9 శాతానికి పెరగనుంది. మొండిబాకీలు పెరుగుతుండటం, రుణ వృద్ధి తగ్గుతుండటం, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తదితర అంశాలు ఇందుకు కారణం కాగలవని ఆర్‌బీఐ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండిబాకీల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 2019 సెప్టెంబర్‌లో 12.7%గా ఉండగా.. 2020 సెప్టెంబర్‌ నాటికి 13.2%కి పెరగవచ్చని అంచనా వేసింది. అలాగే ప్రైవేట్‌ బ్యాంకుల జీఎన్‌పీఏ నిష్పత్తి 3.9 శాతం నుంచి 4.2 శాతానికి పెరగవచ్చని పేర్కొంది.  

>
మరిన్ని వార్తలు