బ్యాంకులకు తగినంత సమయం ఇవ్వాల్సింది

27 Oct, 2017 00:40 IST|Sakshi

ఫలితాలు మెరుగ్గా ఉండేవి

పెద్ద నోట్ల రద్దుపై ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్‌ అరుంధతి

ముంబై: పెద్ద నోట్ల రద్దు విషయంలో బ్యాంకులు సన్నద్ధమయ్యేందుకు వాటికి మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని ఎస్‌బీఐ మాజీ చైర్‌ పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ఇటీవలే ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌ పదవి నుంచి విరమణ తీసుకున్న ఆమె గురువారం ముంబైలో ‘ఇండియాటుడే’  నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

నల్లధనాన్ని, నకిలీ నోట్లను ఏరిపారేస్తామంటూ గతేడాది నవంబర్‌ 8న రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచి చెడుల గురించి అరుంధతి మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయం బ్యాంకులపై భారీ పని భారానికి దారి తీసిన నేపథ్యంలో దీనిపై అరుంధతి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ‘‘దేనికైనా మనం ఎక్కువగా సన్నద్ధమై ఉంటే దాని తాలూకూ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.

నిజానికి అక్కడ మరింత సన్నద్ధమై ఉంటే (పెద్ద నోట్ల రద్దు) మాపై శ్రమ అంత ఉండేది కాదు. నగదును కదిలించాలంటే అందుకు నిబంధనలు ఉన్నాయి. మాకు పోలీసులు అవసరం. కాన్వాయ్‌ను సమకూర్చాలి. మార్గనిర్దేశం చేయాలి. ఇది భారీ రవాణా సన్నాహకం’’ అని అరుంధతీ భట్టాచార్య అన్నారు. నోట్ల రద్దు సరైన చర్యా, కాదా అన్నది తేల్చడానికి మరింత సమయం అవసరమన్నారు. డీమోనిటైజేషన్‌ వల్ల ప్రయోజనాలు ఏంటన్న దానిపై 40 శాతం పన్ను చెల్లింపుదారులు పెరిగారని, డిజిటల్‌ లావాదేవీలు పుంజుకున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు