బార్‌ట్రానిక్స్‌ దివాలాకు ఓకే

6 Dec, 2019 00:42 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐటీ సర్వీసులు, బిజినెస్‌ సొల్యూషన్స్‌ కంపెనీ బార్‌ట్రానిక్స్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ అనుమతి ఇచ్చింది. ఇటీవల బీజేపీలో చేరిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి చెందిన కంపెనీగా గతంలో పలుమార్లు ఈ కంపెనీపై ఆరోపణలొచ్చాయి. ఆయన బినామీలే నడిపిస్తున్నారనే వ్యాఖ్యలూ వచ్చాయి. సుజనా చౌదరికి చెందిన కంపెనీలు సుజనా టవర్స్, సుజనా యూనివర్సల్, సుజనా స్టీల్స్‌ ఇప్పటికే వేల కోట్ల రూపాయలు బకాయిల్ని బ్యాంకులకు తిరిగి చెల్లించటంలో డిఫాల్ట్‌ అయ్యాయి.

బార్‌ట్రానిక్స్‌ సైతం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఇండియన్‌ బ్యాంకు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. బ్యాంకుకు బార్‌ట్రానిక్స్‌ అసలు, వడ్డీతో కలిపి రూ.39.96 కోట్లు బాకీ పడింది. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా చిన్నం పూర్ణచంద్ర రావును ఎన్‌సీఎల్‌టీ నియమించింది.

మరిన్ని వార్తలు