మారిన లెక్క.. పెరిగిన జీడీపీ

31 Jan, 2015 04:51 IST|Sakshi
మారిన లెక్క.. పెరిగిన జీడీపీ

* గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 4.7 శాతం నుంచి 6.9 శాతానికి పెంపు
* 2004-05 నుంచి 2011-12కు బేస్ ఇయర్ మారిన ఫలితం

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలకు సంబంధించి బేస్ ఇయర్‌ను మార్చడంతో గత సంవత్సరాల జీడీపీ వృద్ధి రేట్లను పెంచుతూ సవరించారు. ఈ మార్పుతో 2013-14 జీడీపీ వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 6.9 శాతానికి ఎగసింది. 12-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5.1 శాతానికి చేరింది.

వరుసగా ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో   స్థిర ధరల ప్రకారం విలువ రూపంలో ఈ పరిమాణాలు  రూ.92.8 లక్షల కోట్లు, రూ.99.2 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కొత్త బేస్ ఇయర్ ప్రకారం ప్రస్తుత ధరలపై జీడీపీ పరిమాణం ఈ రెండు సంవత్సరాల్లో రూ. 99.88 లక్షల కోట్లు, రూ. 113.45 లక్షల కోట్లుగా వుంది.  2011-12  మార్కెట్ ధరల ప్రాతిపదికన తాజా బేస్ ఇయర్ అమల్లోకి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ గురించి మరింత స్పష్టమైన చిత్రం రావడానికి గణాంకాల మంత్రిత్వశాఖ బేస్ ఇయర్‌ను మార్చింది.

చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను తెలియజేశారు. జీడీపీ డేటా కోసం ఇప్పటి వరకూ బేస్ ఇయర్ 2004-2005 కాగా, తాజాగా 2011-2012కు మార్చారు. అంటే జాతీయ గణాంకాలు 2004-2005 స్థిర ధరలు కాకుండా 2011-2012 ఆర్థిక సంవత్సరంలోని స్థిర ధరలను పరిగణనలోకి తీసుకుంటారు.
 
బేస్ ఇయర్ అంటే...
వివిధ రంగాలకు సంబంధించిన గణాంకాలకు ఒక నిర్దిష్ట ఏడాదిని మూలంగా తీసుకుని అప్పటి ధర/విలువ ప్రాతిపదికన తదుపరి ప్రతి ఏడాదీ పెరిగే ధర/విలువ వృద్ధి తీరును పరిశీలించడం జరుగుతుంది. పెరుగుదలను శాతాల్లో చూపుతారు. ఈ లెక్కింపునకు ప్రాతిపదికగా తీసుకున్న సంవత్సరాన్నే  ‘బేస్ ఇయర్’ అంటారు.  ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జాతీయ అకౌంట్ల గణాంకాలకు సంబంధించి బేస్ ఇయర్‌ను మార్చాలని జాతీయ గణాంకాల కమిషన్(ఎన్‌ఎస్‌సీ) సిఫారసు చేసింది. ఇప్పటి వరకూ 10 ఏళ్లకు ఒకసారి ఈ మార్పు ఉండేది.  గతంలో బేస్ ఇయర్‌ను 2010 జనవరిలో కేంద్ర ప్రభుత్వం మార్చింది.
 
ద్రవ్యలోటుపై ఎఫెక్ట్...
బేస్ రేటు మార్పు నేపథ్యంలో భారీగా పెరగనున్న ఆర్థిక పరిమాణం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు(ప్రభుత్వానికి వచ్చే ఆదాయం-చేసే వ్యయాలకు మధ్య నున్న వ్యత్యాసం)  ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా 4.1 శాతం వద్ద కట్టడి చేయడం సాధ్యమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, స్థిర ధరల ప్రకారం ఆర్థిక పరిమాణం పెరిగినప్పటికీ, ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద ఆర్థిక వృద్ధి పరిమాణం తగ్గడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటుపై బేస్ రేటు మార్పు ప్రభావం ఉండకపోవచ్చని చీఫ్ స్టాటిస్టీషియన్ ఏసీఏ అనంత్ పేర్కొన్నారు.
 
తలసరి ఆదాయం నెలకు రూ.80 వేలు
బేస్ ఇయర్ మార్పు ప్రాతిపదికన కరెంట్ ప్రైసెస్ వద్ద చూస్తే, వార్షికంగా మూడు సంవత్సరాలకు సంబంధించి ఈ మొత్తం 2011-12, 2012-13, 2013-14లలో వరుసగా, రూ.64,316, రూ.71,593, రూ.80,388గా ఉంది.
 
12 ఏళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థ: కేంద్రం

భారత్‌లో పెట్టుబడులకు ఇది సరైన సమయమని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా శుక్రవారం తెలిపారు. 10-12 సంవత్సరాల శ్రేణిలో దేశ ఆర్థిక పరిమాణం 4 నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కూడా ఆయన అంచనావేశారు. భారత ప్రైవేటు వెంచర్ కేపిటల్ అసోసియేషన్ ఇక్కడ జరిపిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోకి భారీగా పెద్ద ఎత్తున కేపిటల్ పెట్టుబడులు(ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ) వస్తున్న నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ పటిష్టంగా ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు.

రానున్న బడ్జెట్‌లో పన్ను సంబంధ సమస్యలను తగిన విధంగా ఎదుర్కొనేలా చర్యలు ఉంటాయని విదేశీ ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. ముంబైని సింగపూర్, లండన్ తరహాలో దిగ్గజ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు.
 అది మా క్రెడిట్... చిదంబరం: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిందని జీడీపీ సవరణ గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు