మోన్శాంటో... బేయర్లో విలీనం

15 Sep, 2016 00:59 IST|Sakshi
మోన్శాంటో... బేయర్లో విలీనం

రెండు సంస్థల మధ్య కుదిరిన డీల్
66 బిలియన్ డాలర్లు చెల్లించనున్న బేయర్

 బెర్లిన్/న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన బహుళజాతి ఫార్మా, కెమికల్స్ కంపెనీ బేయర్ ఏజీ, అమెరికాకు చెందిన బయోటెక్ అగ్రగామి కంపెనీ మోన్‌శాంటో మధ్య ఎట్టకేలకు డీల్ సెట్ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద నగదు ఒప్పందం వీటి మధ్య కుదిరింది. 66 బిలియన్ డాలర్లను నగదు రూపంలో చెల్లించి మోన్‌శాంటోను కొనుగోలు చేసేందుకు బేయర్ ఏజీ ముందుకు వచ్చింది. రెండు కంపెనీల బోర్డులు తాజా ఒప్పందానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ రెండు సంస్థల కలయికతో ప్రపంచంలోనే అతిపెద్ద విత్తన, పురుగుమందుల కంపెనీ అవతరిస్తుంది. బేయర్ ఏజీ, మోన్‌శాంటో అనుబంధ కంపెనీలైన బేయర్ క్రాప్‌సెన్సైస్, మోన్‌శాంటో ఇండియా దేశీయంగానూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

 మోన్‌శాంటోకు మహికో కంపెనీతోనూ భాగస్వామ్యం ఉంది. విలీన ఒప్పందంపై సంతకాలు చేసినట్టు  మోన్‌శాంటో, బేయర్ బుధవారం ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం మోన్‌శాంటో వాటాదారులకు ప్రతి షేరుకు 128 డాలర్లను బేయర్ చెల్లించనుంది. 2017 చివరి నాటికి కొనుగోలు పూర్తవుతుందని భావిస్తున్నట్టు ఇరు సంస్థలు వెల్లడించాయి. మోన్‌శాంటో కొనుగోలుకు బేయర్ ఈ ఏడాది మే నెలలోనే ప్రతిపాదన చేసింది. మే 9న మోన్‌శాంటో షేరు ధరతో పోలిస్తే ప్రస్తుతం చెల్లించనున్న 128 డాలర్లు 44 శాతం అధికం కావడం గమనార్హం. ఈ డీల్‌కు రెండు దేశాల్లోని నియంత్రణ సంస్థల ఆమోదం తప్పనిసరి. ఆమోదం రాకుంటే బ్రేక్ అప్ ఫీజు కింద 2 బిలియన్ డాలర్లను బేయర్ చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు