పట్టిస్తే రూ. 5 కోట్లు!!

2 Jun, 2018 00:22 IST|Sakshi

నల్లకుబేరుల పని పట్టేందుకు ఐటీ శాఖ వ్యూహం

సమాచారం ఇచ్చేవారికి భారీ పారితోషికం

పన్నుల ఎగవేత వివరాలిస్తే రూ.50 లక్షల రివార్డు

న్యూఢిల్లీ: నల్లకుబేరుల భరతం పట్టేందుకు ఆదాయ పన్ను విభాగం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. బ్లాక్‌మనీ, బినామీ లావాదేవీల గురించి నిర్దిష్ట సమాచారమిచ్చే వారికి రూ.కోటి నుంచి రూ.5 కోట్ల దాకా పారితోషికం ఇవ్వనుంది. దేశ, విదేశాల్లోని ఆస్తులు, ఆదాయాలపై పన్నుల ఎగవేతకు సంబంధించి నిర్దిష్ట వివరాలు ఇచ్చే వారికి రూ. 50 లక్షల దాకా బహుమానం అందించనుంది.

ఈ దిశగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ‘బినామీ లావాదేవీల సమాచారమిచ్చే వారికి పారితోషిక పథకం 2018’ని శుక్రవారం ఆవిష్కరించింది. దీని ప్రకారం బినామీ లావాదేవీలు, ఆస్తుల గురించి ఆదాయ పన్ను విభాగానికి సమాచారమిచ్చే వారికి రూ.కోటి దాకా పారితోషికం లభిస్తుంది.

అదే, లెక్కల్లో చూపకుండా విదేశాల్లో దాచిన నల్లధనం గురించి ఉప్పందించిన వారికి రూ.5 కోట్ల దాకా బహుమతి లభిస్తుంది. విదేశీ వేగులకు కూడా ఇది వర్తిస్తుంది. బినామీ లావాదేవీల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోతగిన లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని జాయింట్‌ లేదా అడిషనల్‌ కమిషనర్‌ స్థాయి అధికారులకు అందించవచ్చు.

ప్రజలను ప్రోత్సహించేందుకే...
బినామీ లావాదేవీలు, ఆస్తులు.. వాటిపై ఆదాయాన్ని అందుకునే ఇన్వెస్టర్లు, లబ్ధిదారుల గురించి సమాచారమిచ్చేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని రూపొందించినట్లు సీబీడీటీ పేర్కొంది. ‘బినామీ లావాదేవీల సమాచారమిచ్చే ఇన్ఫార్మర్‌ పారితోషిక పథకం కింద బినామీ లావాదేవీలు, ఆస్తులతో పాటు వాటిపై వచ్చే ఆదాయాలు అందుకుంటున్న వారి గురించి నిర్దిష్ట ఫార్మాట్‌లో.. ఆదాయ పన్ను విభాగం ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టరేట్స్‌లోని బినామీ నిరోధక యూనిట్లలో జాయింట్‌ లేదా అడిషనల్‌ కమిషనర్స్‌కి సమాచారమిస్తే వారికి రూ.1 కోటి దాకా పారితోషికం లభిస్తుంది‘ అని సీబీడీటీ తెలిపింది.

గోప్యంగా ఇన్ఫార్మర్‌ వివరాలు ..
బినామీ లావాదేవీలు, ఆస్తుల గురించి సమాచారమిచ్చే ఇన్ఫార్మర్ల వివరాలను గోప్యంగా ఉంచుతామని సీబీడీటీ పేర్కొంది. బ్లాక్‌ మనీ చట్టం కింద .. లెక్కల్లో చూపకుండా విదేశాల్లో దాచిన నల్లధనం వివరాలు తెలియజేస్తే రూ.5 కోట్ల దాకా రివార్డు లభిస్తుందని సీబీడీటీ వివరించింది. మరొకరి పేరుపై నల్లధనాన్ని ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయని సీబీడీటీ తెలియజేసింది.

ఆయా ఆస్తులు, లావాదేవీలు బినామీల పేరుపై జరిగినా ప్రయోజనాలన్నీ కూడా చాటుగా ఇన్వెస్టర్‌కే చేరుతున్నాయని పేర్కొంది. పన్ను రిటర్నుల్లో ఇలాంటివి కనిపించకుండా వారు జాగ్రత్తపడుతున్నారని వివరించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చట్టాన్ని మరింత పటిష్టంగా చేసే క్రమంలో బినామీ లావాదేవీలను నిరోధించేలా చట్టాన్ని సవరించారు. 

మరిన్ని వార్తలు