ముందుంది మరింత గడ్డుకాలం!

3 Apr, 2020 05:01 IST|Sakshi

ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే...

ఉద్యోగాలకు కోత పెట్టకండి

జీతాల తగ్గింపు, వాయిదాల్లాంటివి ప్రయత్నించండి

కరోనాపై స్టార్టప్‌లకు వీసీల సూచన

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి ఉద్దేశించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో వ్యాపారాలు కుదేలవుతున్నాయి. స్టార్టప్‌ సంస్థలు మరింతగా విలవిల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని స్టార్టప్‌లకు యాక్సెల్, కలారి, ఎస్‌ఏఐఎఫ్‌ పార్ట్‌నర్స్, సెకోయా వంటి వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) సంస్థలు సూచించాయి. కష్టకాలంలో ఉద్యోగాలకు కోత పెట్టకుండా ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని పేర్కొన్నాయి. జీతాలు వాయిదా లేదా తగ్గించడం వంటివి పరిశీలించాలని సూచించాయి. వీసీలు ఈ మేరకు స్టార్టప్‌లకు బహిరంగ లేఖ రాశాయి.

వచ్చే 21–30 రోజుల్లో అంకుర సంస్థల వ్యవస్థాపకులు ప్రణాళికల అమలుకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, వచ్చే ఏడాది–ఏడాదిన్నర కాలానికి ఎలా ప్రణాళిలు వేసుకోవాలన్న దానిపై తీవ్రంగా కసరత్తు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు కుదేలవడంతో వ్యయాలను తగ్గించుకునేందుకు, గడ్డుకాలం గట్టెక్కేందుకు పలు స్టార్టప్‌ సంస్థలు, డిజిటల్‌ వ్యాపార సంస్థలు.. సిబ్బందిని తొలగిస్తుండటం, జీతాల్లో కోత పెడుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో తాజాగా వీసీల సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

వేచి చూసే ధోరణి వద్దు ..
‘భారత్‌లో తొలి దశ ఇన్వెస్టర్లుగా .. మేమంతా దేశీ స్టార్టప్‌ వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై చాలా ఆశావహంగా ఉన్నాం. మేం ఇన్వెస్ట్‌ చేసిన సంస్థల వ్యవస్థాపకులు, టీమ్‌లపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి వారంతా బైటపడాలని కోరుకుంటున్నాము‘ అని లేఖలో వీసీ సంస్థలు పేర్కొన్నాయి. నిధుల సమీకరణ, ఉద్యోగుల నిర్వహణ, వ్యాపారాన్ని కొనసాగించే ప్రణాళికలు మొదలుకుని ఇన్వెస్టర్లు, వివిధ వాటాదారులతో వ్యవహరించాల్సిన తీరు గురించి ఇందులో పలు సలహాలు, సూచనలు చేశాయి.

స్థూలంగా దేశంలో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయని ఎప్పటికప్పుడు వాటికి అనుగుణంగా మార్పులు చేసుకోగలగడం స్టార్టప్‌లకు చాలా కీలకమని పేర్కొన్నాయి. ‘అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ఒకవేళ పరిస్థితి వేగంగా మెరుగుపడిన పక్షంలో దానికి తగ్గట్లుగా సర్దుకుపోవడానికి కూడా సంసిద్ధత ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పష్టత వస్తుందనే ఆశతో.. వేచి చూద్దాం, స్పష్టత వచ్చాకే ఏదో ఒక చర్య తీసుకుందాంలే  అనే ధోరణి సరికాదు‘ అని వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు సూచించాయి.

ఉద్యోగులు ముఖ్యం...
ఈ సందర్భంగా ఏయే అంశాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నదీ వీసీలు వివరించాయి. ‘ముందు ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. ఆ తర్వాతే వ్యాపారాల కొనసాగింపు, లిక్విడిటీ ఉండాలి ‘ అని పేర్కొన్నాయి. మిగతా వ్యయాలన్నింటినీ సమీక్షించుకుని, తగ్గించుకున్న తర్వాతే సిబ్బంది వ్యయాలపై దృష్టి పెట్టాలన్నాయి. సిబ్బంది తొలగింపు, జీతాల తగ్గింపు వంటి అంశాల విషయంలో ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు తెలుసుకుంటూ అప్‌డేట్‌ అవుతూ ఉండాలని సూచించాయి. ఒకవేళ ఉద్యోగులపరమై వ్యయాలను తగ్గించుకోవాల్సి వస్తే.. రిక్రూట్‌మెంట్‌ను తాత్కాలికంగా ఆపడం, జీతాలు వాయిదా వేయడం.. తగ్గించడం, విధుల్లో మార్పుచేర్పులు చేయడం, ప్రమోషన్లు వంటి మదింపు విధానాలను సవరించుకోవడం వంటి ప్రత్యామ్నాయ అవకాశాలు పరిశీలించాలని తెలిపాయి.

>
మరిన్ని వార్తలు