1,200 డాలర్ల దిగువకు పసిడి?

6 Aug, 2018 00:15 IST|Sakshi

పసిడికి మరింత దిగువస్థాయి ఖాయమన్న అంచనాలు అధికమయ్యాయి. పతన వేగం కొంత తగ్గినప్పటికీ అంతర్జాతీయ నైమెక్స్‌ కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ఔన్స్‌ (31.1గ్రా) ధర 1,180 డాలర్ల స్థాయిని తాకుతుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 4 శాతంపైన అమెరికా ఆర్థిక వృద్ధి నేపథ్యంలో అమెరికా డాలర్‌ బలోపేతం, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు ఇన్వెస్టర్‌ మొగ్గుచూపడం వంటి అంశాలు దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆగస్టు 3వ తేదీతో ముగిసిన వారంలో  పసిడి డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర ఏడాది కనిష్ట స్థాయిని చూసింది. వారంలో 0.67 శాతం పడిపోయి, 1,221 డాలర్ల వద్ద ముగిసింది. అయితే ఈ స్థాయిలో పసిడి ఫ్యూచర్స్‌ షార్ట్‌ చేయడంలో కొంత ఆచితూచి వ్యవహరించాలని కూడా పలువురు సూచిస్తున్నారు.  గడచిన ఎనిమిది వారాల్లో ఏడు వారాలు పసిడి దిగువస్థాయిలవైపే పయనించడం గమనార్హం. కాగా ఇదే సమయంలో డాలర్‌ ఇండెక్స్‌ 94–95 శ్రేణిలో తిరిగి వారం చివరకు 95.03 స్థాయి వద్ద ముగియడం మరో విశేషం.  

దేశీయంగానూ నష్టాలే.. 
ఇక ముంబై ప్రధాన మార్కెట్‌లో వారంలో పసిడి 99.9, 99.5 స్వచ్ఛత ధరలు రూ.270 చొప్పున తగ్గి రూ. 29,605, రూ. 29,455 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ. రూ. 60 తగ్గి రూ. 37,760 వద్ద ముగిసింది. ఇక దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ఎంసీఎక్స్‌లో శుక్రవారం ధర 29,650 వద్ద ముగిసింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 68.60 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు