సెప్టెంబర్‌ కల్లా రెండు రైల్వే ఐపీఓలు!

23 Apr, 2019 00:22 IST|Sakshi

ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీఓలపై కసరత్తు

రూ.1,500 కోట్లు  సమీకరించనున్న కేంద్రం

న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీల ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈ ఏడాది సెప్టెంబర్‌ కల్లా వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. ఎన్నికలు పూర్తయి, కొత్త ప్రభుత్వం కొలువు దీరాక ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పిస్తామన్నారు. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద ఈ రెండు రైల్వే కంపెనీల ఐపీఓల ద్వారా రూ.1,500 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలనే కేంద్రం రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో 12.2 శాతం వాటా విక్రయం ద్వారా రూ.480 కోట్లు సమీకరించింది.  

ఐఆర్‌ఎఫ్‌సీపై తుది నిర్ణయం.... 
ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) ఐపీఓను ఈ ఏడాది మొదట్లోనే తేవాలని ప్రభుత్వం భావించింది. ఐఆర్‌ఎఫ్‌సీ స్టాక్‌ మార్కెట్లో లిస్టైతే, వడ్డీ వ్యయాలు పెరుగుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ విషయమై కేంద్ర కేబినెట్‌ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. రైల్వేలకు సంబంధించి విస్తరణ ప్రణాళికలకు కావలసిన నిధులను ఐఆర్‌ఎఫ్‌సీ క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి సమీకరిస్తుంది. ఇక రైల్వేలకు చెందిన కేటరింగ్, టూరిజమ్‌ కార్యకలాపాలను ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తోంది.  

2017లోనే లిస్టింగ్‌ నిర్ణయం... 
ఐదు రైల్వే కంపెనీలను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయాలనే ప్రతిపాదనను 2017 ఏప్రిల్‌లోనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇర్కాన్‌ ఇంటర్నేషనల్, రైట్స్, ఆర్‌వీఎన్‌ఎల్‌లు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాయి. ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ లిస్ట్‌ కావలసి ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా రూ.90,000 కోట్లు సమీకరించాలని ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది.    

>
మరిన్ని వార్తలు