మాస్‌ మార్కెట్లోకి బెనెల్లి

1 Dec, 2018 00:29 IST|Sakshi

భారత్‌కు 125–200 సీసీ వాహనాలు

2020లో అందుబాటులోకి తెస్తాం

బెనెల్లి ఇండియా ఎండీ వికాస్‌ జబక్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రీమియం బైక్‌ల బ్రాండ్‌ బెనెల్లి... భారత్‌లో మాస్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తోంది. ఇందుకోసం 200 సీసీలోపు సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తేబోతోంది. అంతర్జాతీయంగా ఈ విభాగంలో కంపెనీ ఇప్పటికే ఏడు మోడళ్లను అందుబాటులో ఉంచింది. వీటిలో 125 సీసీ, 150, 175 సీసీ స్కూటర్లు కూడా ఉన్నాయి. ‘‘ఇవన్నీ కూడా 2020లో భారతీయ రోడ్లపై పరుగులు పెడతాయి’’ అని బెనెల్లి ఇండియా ఎండీ వికాస్‌ జబక్‌ శుక్రవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ఆ సమయానికి తమ తయారీ కేంద్రం కూడా రెడీ అవుతుందని, ఆ ప్లాంటులో ఇవి రూపుదిద్దుకుంటాయని చెప్పారాయన. 200 సీసీలోపు మోడళ్ల ధర ఎక్స్‌షోరూంలో రూ.2 లక్షల లోపే ఉంటుందని పేర్కొన్నారు. ధర ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పారు. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో బెనెల్లి ప్రస్తుతం 18 రకాల మోడళ్లను విక్రయిస్తోంది. 

డిసెంబర్‌లో మూడు మోడళ్లు.. 
మహవీర్‌ గ్రూప్‌ కంపెనీ అయిన ఆదీశ్వర్‌ ఆటోరైడ్‌ ఇండియా (ఏఏఆర్‌ఐ) భారత్‌లో బెనెల్లి పంపిణీదారుగా ఉంది. హైదరాబాద్‌లో ఏఏఆర్‌ఐ అసెంబ్లింగ్‌ ప్లాంటును నెలకొల్పింది. ఈ కేంద్రంలో డిసెంబర్‌ తొలి వారంలో ద్విచక్ర వాహనాల అసెంబ్లింగ్‌ మొదలు కానుంది. రెండో వారం నుంచి ఇవి విక్రయ కేంద్రాలకు చేరతాయని వికాస్‌ వెల్లడించారు. ‘అసెంబ్లింగ్‌ ప్లాంటు కోసం కంపెనీ రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టింది. వార్షిక సామర్థ్యం ఒక షిఫ్టుకు 7,000 యూనిట్లు. బెనెల్లి టీఎన్‌టీ 300, 302ఆర్, టీఎన్‌టీ 600ఐ బైక్‌లను రీలాంచ్‌ చేస్తున్నాం. వీటి ధరలు ఎక్స్‌ షోరూంలో వరుసగా రూ.3,50,000, రూ.3,70,000, రూ.6,20,000గా ఉంటాయి. అయిదేళ్ల వారంటీ ఇస్తున్నాం. ప్రస్తుతం 15 డీలర్‌షిప్‌ కేంద్రాలున్నాయి. మరో 25 కేంద్రాలు మార్చికల్లా రానున్నాయి’ అని వివరించారు. 

మరిన్ని వార్తలు