ఓలాలో బెంగళూరు-నార్త్‌కొరియా, ఛార్జీ ఎంతంటే..

20 Mar, 2018 15:35 IST|Sakshi

న్యూఢిల్లీ :  ఎప్పుడైనా ఓలా క్యాబ్‌ను ఒక దేశం నుంచి మరో దేశానికి బుక్‌ చేసుకుని చూశారా? అసలు ఆ సర్వీసులను ఓలా క్యాబ్‌ ఆఫర్‌ చేస్తోందో లేదో తెలుసా? అదే పరీక్షించాలనుకున్నాడు బెంగళూరుకు చెందిన ఓ విద్యార్థి. ప్రపంచంలో అత్యంత రహస్యమైన, కఠిన నియంత్రిత దేశాలలో ఒకటిగా పేరున్న ఉత్తర కొరియాకు ఓలా క్యాబ్‌ను బుక్‌ చేశాడు. అయితే ఎక్కడి నుంచి బుక్‌ చేశాడో తెలుసా? బెంగళూరులోని తన ఇంటి నుంచి ఉత్తర కొరియాకు తన ఓలా రైడ్‌ను బుక్‌ చేశాడు. ఈ డ్రైవ్‌ను ఓలా కూడా ఓకే చేసింది. అంచనా ఛార్జీగా లక్షా 49వేల రూపాయలను చూపించింది. 

‘ఉత్తర కొరియా ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ట్రెండ్‌ అయ్యే దేశాల్లో ఒకటి. ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు రోడ్‌ కనెక్టివిటీని గూగుల్‌ మ్యాప్స్‌లో చెక్‌ చేయకుండా డైరెక్ట్‌గా ఓలా యాప్‌ను ఓపెన్‌చేశా. అక్కడ క్యాబ్‌ బుకింగ్‌ ఆప్షన్‌ కనిపించింది. నిజంగా అది చూసి నేను చాలా షాక్‌ అయ్యా’ అని బెంగళూరు యువకుడు ప్రశాంత్‌ షాహి అన్నాడు. 

రైడ్‌ ఓకే చేయడంతో, క్యాబ్‌ కంపెనీ కూడా తాను చేసిన రైడ్‌ను ఓకే చేసి, డ్రైవర్‌ వివరాలను పంపిందని తెలిపాడు. ఐదు రోజుల పాటు సాగే ఈ రోడ్డు ట్రిప్‌కు లక్షా 49వేల 88 రూపాయలుగా చూపించిందని చెప్పాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లను కూడా ఎన్‌డీటీవీకి షేర్‌చేశాడు. అంతేకాక తన ట్విటర్‌ అకౌంట్‌లో ఈ ట్రిప్‌కు సంబంధించిన వివరాలను కూడా పోస్టు చేశాడు.  నిమిషాల వ్యవధిలోనే ఈ ట్వీట్‌కు అనూహ్య స్పందన వచ్చింది.

ఉత్తర కొరియాకు ఓలా క్యాబ్‌లో ట్రిప్‌ ఎలా సాధ్యమవుతుంది? ఓలా మీ సిస్టమ్స్‌ను ఒక్కసారి చెక్‌ చేసుకోండంటూ స్పందనలు వస్తున్నాయి. ఈ ట్వీట్లకు స్పందించిన ఓలా క్యాబ్‌ కంపెనీ, తన సిస్టమ్‌లో టెక్నికల్‌ సమస్య ఏర్పడిందని, ఒక్కసారి యూజర్‌ తన ఫోన్‌ను రీస్ట్రాట్‌ చేసుకోవాలని సూచించింది. ఓలా క్యాబ్‌ సిస్టమ్‌లో ఇలా టెక్నికల్‌ సమస్య ఏర్పడటం ఇదేమీ తొలిసారి కాదు. గతేడాది కూడా ముంబైలో ఒక నిమిషం రైడ్‌కు ఓ వ్యక్తికి 149 కోట్ల బిల్లు వేసింది.  

మరిన్ని వార్తలు