గోల్డ్‌ స్కీమ్స్‌తో జాగ్రత్త!

15 Apr, 2019 05:15 IST|Sakshi

మీ సొమ్ములు ఎవరి హమీ ఉండదు!  

అనుమతి లేని డిపాజిట్‌ పథకాలను నిషేధించిన కేంద్రం

నిబంధనల అడ్డుతో 11 నెలలకే పరిమితమైన బంగారం పథకాలు

వీటి చెల్లుబాటుపై అస్పష్టత ఉందంటున్న నిపుణులు

ఎవరి నియంత్రణ లేని పథకాలివి

సమస్య ఎదురైతే పోలీసులే దిక్కు

ముందస్తు వాణిజ్యంగా వీటిని పేర్కొంటున్న జ్యుయలర్లు

బంగారు వర్తకులు ఆఫర్‌ చేసే బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా...? ఏడాది పాటు పొదుపు చేయడం వల్ల ఒక నెల మొత్తం బోనస్‌గా లభించడం, ఎటువంటి తరుగు లేకుండా నగలు కొనుగోలుకు అవకాశం కల్పించే ఆఫర్లు ఆకర్షిస్తున్నాయా..? కానీ, జ్యుయలర్స్‌ ఆఫర్‌ చేసే సేవింగ్స్‌ పథకాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలన్నది నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి లేని డిపాజిట్‌ పథకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. వాస్తవానికి అనుమతి లేని అన్ని పథకాలకు ఇది వర్తిస్తుందని భావించారు. జ్యుయలరీ సంస్థల పథకాలకు కూడా బ్రేక్‌ పడుతుందనుకున్నప్పటికీ... అవి మాత్రం ఇంతకుముందు మాదిరే నిధులను సమీకరిస్తూనే ఉన్నాయి. కాకపోతే చట్టంలో ఉన్న చిన్న వెసులుబాటును అనుకూలంగా మలచుకుని జ్యూయలరీ సంస్థలు తమ పొదుపు పథకాలను కేవలం పదకొండు నెలల
కాలానికే పరిమితం చేస్తున్నాయి.

చట్టానికి అతీతంగా  జ్యుయలరీ సంస్థలు వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. కంపెనీల చట్టం 2014... బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు మినహా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించే ఇతర సంస్థలకు షరతులు విధించింది. 365 రోజులకు మించిన కాలానికి డిపాజిట్లు తీసుకునే రిజిస్టర్డ్‌ సంస్థలు అన్నీ కూడా కచ్చితంగా తిరిగి చెల్లించే సామర్థ్యంపై రేటింగ్‌ తీసుకోవడంతోపాటు, డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ను కూడా తీసుకోవాలి. పైగా డిపాజిట్‌పై వడ్డీని ఎన్‌బీఎఫ్‌సీల కంటే ఎక్కువ ఆఫర్‌ చేయరాదు. కానీ, జ్యుయలరీ సంస్థలు మాత్రం గతంలో 12, 24, 36 నెలల పథకాలను నిర్వహించగా, చట్టంలోని నిబంధనలు కఠినతరం కావడంతో తమ పథకాల కాల వ్యవధిని 11 నెలలకు కుదించుకున్నాయి.  

సంస్థ బిచాణా ఎత్తేస్తే?
ఆభరణాల సంస్థలు వినియోగదారులను మోసం చేసిన ఘటనలు కూడా లేకపోలేదు. ఇందుకు నిదర్శనం తమిళనాడుకు చెందిన నాదెళ్ల సంపత్‌ జ్యుయలరీ సంస్థ వ్యవహారమే. తమిళనాడులో బంగారు ఆభరణాల మార్కెట్లో మంచి పేరున్న సంస్థ. 75 ఏళ్లకు పైగా కార్యకలాపాల్లో ఉన్న సంస్థ. కానీ 2017 అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆభరణాల దుకాణాలను ఆర్థిక సమస్యల కారణంగా ఈ సంస్థ మూసేసింది. ఖాతాల్లో అవకతవకలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం వెలుగు చూశాయి. నాదెళ్ల బంగారు పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు ఉసూరుమనక తప్పలేదు. కంపెనీ 2018 మే నెలలో దివాలా పిటిషన్‌ వేసింది. ఈ తరహా పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసే వారికి ఈ సంఘటన ఓ హెచ్చరిక వంటిది. బంగారు ఆభరణాల సంస్థ దివాలా పిటిషన్‌ దాఖలు చేస్తే, ఆస్తులను విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ఖర్చులు పోను, ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లిస్తారు. మిగిలి ఉంటే సెక్యూర్డ్‌ రుణదాతలకు చెల్లింపులు చేస్తారు. ఆ తర్వాత అన్‌సెక్యూర్డ్‌ రుణదాతల వంతు వస్తుంది. బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసే వారు అన్‌సెక్యూర్డ్‌ ఆపరేషనల్‌ క్రెడిటర్ల కిందకు వస్తారని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కనుక కస్టమర్ల వంతు ఆఖరు అవుతుంది.

లొసుగులు..
అనుమతి లేని డిపాజిట్‌ పథకాల నిషేధ ఆర్డినెన్స్‌... డిపాజిట్‌కు నిర్వచనం ఇచ్చింది. అడ్వాన్స్‌ రూపంలో తీసుకోవడం లేదా రుణం, తిరిగి నగదు లేదా సేవ రూపంలో ఇస్తానన్న హామీతో తీసుకునే మొత్తాన్ని డిపాజిట్‌గా పేర్కొంది. ఎవరు డిపాజిట్‌ తీసుకున్నారన్నది ఇక్కడ అంశం కాదు. వ్యక్తి లేదా యాజమాన్య సంస్థ, భాగస్వామ్య సంస్థ, కోపరేటివ్‌ సొసైటీ లేదా ట్రస్ట్‌ అయినా కావచ్చు. కనుక జ్యుయలర్స్‌ నిర్వహించే పథకాలు ఈ చట్టం పరిధిలోకే వస్తాయంటున్నారు కొందరు. అయితే, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. బంధువుల నుంచి రుణాల రూపంలో తీసుకోవడం, వ్యాపార సరుకుల సరఫరా కోసం అడ్వాన్స్‌ రూపంలో తీసుకోవడానికి డిపాజిట్‌ నిర్వచనం నుంచి మినహాయింపు ఉంది. భవిష్యత్తులో ఆభరణాల కొనుగోలు సాధనాలుగా తాము బంగారం పొదుపు పథకాలను విక్రయిస్తున్నట్టు జ్యుయలరీ వర్తకులు సమర్థించుకుంటున్నారు. కనుక దీన్ని ముందస్తు వాణిజ్యంగా చూడాలని పేర్కొంటున్నాయి.

డిపాజిట్లు కాదు...
‘‘జ్యుయలర్ల పొదుపు పథకాలకు సంబంధించి ఆర్డినెన్స్‌ తీసుకురాలేదు. జ్యుయలర్స్‌ సమీకరించే నిధులు కేవలం ముందస్తు వాణిజ్య రూపంలోనే. దీన్ని డిపాజిట్‌గా చూడరాదు. ఈ పథకాల కింద కస్టమర్లకు తగ్గింపులు, బహుమానాలు ఆఫర్‌ చేయవచ్చా, స్పష్టం చేయాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాశాం’’ అని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జ్యుయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ తెలిపారు.  
నిపుణుల అభిప్రాయాలు వేరు
అయితే, బంగారం డిపాజిట్‌ పథకాలు అనుమతి లేని డిపాజిట్‌ పథకాల నిషేధ ఆర్డినెన్స్‌ పరిధిలోకి వస్తాయా అన్న దానిపై అస్పష్టత నెలకొందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ముందస్తు వాణిజ్యం పేరుతో తప్పించుకోవడం కుదరదని మరో నిపుణుడు పేర్కొన్నారు. ‘‘ఓ కస్టమర్‌ కొన్ని నెలల పాటు నగదు ఉంచి, చివర్లో ఏది కొనుగోలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. లేదా ఆ డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. అన్ని నెలల పాటు అతడు చెల్లించినది డిపాజిట్‌కు భిన్నమేమీ కాదు. వస్తువులకు ముందస్తుగా చెల్లించడం అంటే... మా అభిప్రాయం ప్రకారం ఆ సరుకులు ఏంటన్నది ముందే గుర్తించాల్సి ఉంటుంది. ఏదన్నది గుర్తించకుండా ముందుగానే అడ్వాన్స్‌గా ఎవరూ చెల్లించరు. కనుక ఈ తరహా పథకాలను నిషేధించాలి’’ అని వినోద్‌ కొతారి అండ్‌ కంపెనీ సీనియర్‌ అసోసియేట్‌ సీఎస్‌ శిఖా బన్సాల్‌ అభిప్రాయపడ్డారు.  

ఎవరి నియంత్రణ?
బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ లేదా కంపెనీల చట్టం కింద నమోదైన ఓ కంపెనీ, మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో డిపాజిట్‌ చేసి చేతులు కాల్చుకుంటే... సంబంధిత నియంత్రణ సంస్థలు ఆర్‌బీఐ, కార్పొరేట్‌ శాఖ, సెబీ ఫిర్యాదుల పరిష్కార బాధ్యత చూస్తాయి. బంగారం పొదుపు పథకాల విషయానికొస్తే వీటిని నియంత్రించే సంస్థ లేదు. చాలా వరకు ఈ జ్యుయలరీ సంస్థలు కంపెనీలుగా రిజిస్టర్డ్‌ అయినవి కావు. కనుక కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ జోక్యం చేసుకోదు. ఈ తరహా అనియంత్రిత డిపాజిట్‌ పథకాలకు సంబంధించి సమస్య ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్ప పరిష్కారం లేదు. కనుక పరిష్కారానికి సమయం తీసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు