దలాల్‌ స్ట్రీట్‌లోకి కొత్త జూదగాళ్లు వచ్చారు జాగ్రత్త..!

16 Jun, 2020 15:50 IST|Sakshi

మరో 6నెలల పాటు నిఫ్టీ 8,000-10,500 శ్రేణిలోనే 

ఫార్మా, ఐటీ, టెలికాం షేర్లు మార్కెట్‌ నడిపిస్తాయి

ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు విజయ్‌ ఖేడియా అభిప్రాయం

దలాల్‌ స్ట్రీట్‌లోకి కొత్త జూదగాళ్లు వచ్చారని, ఈ నేపథ్యంలో అప్రమత్తత వహించాలంటూ ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు విజయ్‌ ఖేడియా హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సమయంలో కొత్త సంపన్నుల రాకతో భారత స్టాక్‌ మార్కెట్‌ రద్దీగా మారినట్లు ఖేడియా తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా దేశ ప్రజలందరూ తమ ఆర్థిక, సామాజిక కార్యక్రమాలను నిలిపివేసి ఇళ్లకు పరిమితం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇదే సమయంలో ఇండియా డిపాజిటరీ గణాంకాలను పరిశీలిస్తే ఈ లాక్‌డౌన్‌ కాలం(3నెలలు)లో కొత్త డీమాట్‌ అకౌంట్ల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు 18లక్షల కొత్త డిమాండ్‌ అకౌంట్లు మార్చి-మే నెలలో పుట్టుకొచ్చినట్లు సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెర్‌ నివేదికలు చెబుతున్నాయి. 

మార్కెట్లోకి ఈ కొత్తగా ప్రవేశించినవారిని ఇన్వెస్టర్లు లేదా ట్రేడర్లుగా అని పిలుస్తారని, కాని తాను మాత్రం వారిని జూదగాళ్లుగా పిలవడానికి ఇష్టపడతానని ప్రజలను పేర్కోన్నారు. వీరికి ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పందెం కాయడానికి చట్టపరమైన హక్కులు ఉన్నాయన్నారు. జూదగాడికి, ఫ్యూచర్స్‌ ట్రేడర్‌కు మధ్య ఒక చిన్న తేడా ఉంటుందని, జూదగాడు ఊహాగానాలను విశ్వసిస్తారని ఆయన తెలిపారు. అందుకే ఈక్విటీ మార్కెట్‌ భారీగా ఒడిదుడుకులకు లోనవుతుందని తెలిపారు. అయితే లాక్‌డౌన్‌ టైంలో మార్కెట్లోకి వచ్చిన నిజమైన ఇన్వెస్టర్లకు ఆయన రెండు సలహాలిచ్చారు. ఇంట్రాడే ట్రేడింగ్‌కు దూరంగా ఉండమని, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడుల ద్వారా వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించాలని ఖేడియా తెలిపారు. 

మరో 6నెలల పాటు నిఫ్టీ 8,000-10,500 శ్రేణిలోనే: 
నిఫ్టీ ఇండెక్స్‌ మరో 6నెలల పాటు నిఫ్టీ 8,000-10,500 శ్రేణిలోనే కదలాడేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు విజయ్‌ ఖేడియా అభిప్రాయపడ్డారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థ, కోవిడ్‌-19 అంశాల నుంచి మరో 6-9 నెలల పాటు ప్రతికూల వార్తలనే ఊహించవచ్చు. ఈ వార్తలు మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనపరిస్తాయి. మారిటోరియం విధింపు నిషేధం ముగింపు తర్వాత ఎన్‌పీఏలపై స్పష్టత వస్తుంది. ఇది మార్కెట్‌ తదుపరి గమనానికి కీలకం అవుతుంది.’’ అని ఆయన పేరొన్నారు.

ఫార్మా, ఐటీ, టెలికాం షేర్లు మార్కెట్‌ నడిపిస్తాయి:
ఫార్మా, ఐటీ, టెలికాం రంగాలకు చెందిన షేర్లపై ఖేడియా బుల్లిష్‌ వైఖరిని కలిగి ఉన్నారు. ఈ 3 రంగాల షేర్లు ఈ ఏడాది మార్కెట్‌ను నడిపిస్తాయని ఆయన అంటున్నారు. ముఖ్యంగా ఫార్మా షేర్లు బాగా అప్‌ట్రెండ్‌ మూమెంటమ్‌ను కలిగి ఉన్నాయన్నారు. అయితే బెంచ్మార్క్ ఇండెక్స్‌లో 33 శాతం వెయిటేజీని కలిగి ఉన్న బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లు భారీగా క్షీణించవచ్చని ఖేడియా తెలిపారు.

మరిన్ని వార్తలు