19న రెండో దశ భారత్‌ –22 ఈటీఎఫ్‌

14 Jun, 2018 00:46 IST|Sakshi

రూ.8,400 కోట్ల సమీకరణ  

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నెల 19న రెండో దశ భారత్‌– 22 ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ను (ఈటీఎఫ్‌) ప్రారంభిస్తోంది. ఈ ఈటీఎఫ్‌ ద్వారా రూ.8,400 కోట్లు సమీకరించనుంది. ఈ నెల19న యాంకర్‌ ఇన్వెస్టర్లు, ఈ నెల 20న సంస్థాగత, రిటైల్‌ ఇన్వెస్టర్లు సబ్‌స్క్రైబ్‌ చేయవచ్చని, ఈ నెల 22 వరకూ ఈ ఈటీఎఫ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌ కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరలో 2.5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుందని పేర్కొంది. ఈ ఈటీఎఫ్‌ ద్వారా రూ.6,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదనంగా వచ్చే నిధుల్లో  రూ.2,400 కోట్ల వరకూ  అట్టిపెట్టుకునే (గ్రీన్‌ షూ ఆప్షన్‌) వెసులుబాటును కూడా వినియోగించుకోవాలని భావిస్తోంది. మొత్తం మీద ఈ ఈటీఎఫ్‌ ద్వారా ప్రభుత్వం రూ.8,400 కోట్ల నిధులను సమీకరించే అవకాశం ఉంది.

గత నవంబర్లో తొలిసారి...
గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం భారత్‌ –22 ఈటీఎఫ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఈటీఎఫ్‌లో ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్, ఎల్‌ అండ్‌ టీతో పాటు ప్రభుత్వ బ్యాంక్‌లు, ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి మొత్తంగా 22 సంస్థల షేర్లున్నాయి. ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఎస్‌బీఐ, బీపీసీఎల్, కోల్‌ ఇండియా, నాల్కో, భారత్‌ ఎలక్ట్రానిక్స్, ఇంజినీర్స్‌ ఇండియా, ఎన్‌బీసీసీ, ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, గెయిల్, బీఓబీ, ఇండియన్‌ బ్యాంక్‌  ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఈటీఎఫ్‌కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. రూ.32,000 కోట్ల వరకూ బిడ్‌లు వచ్చినా, ప్రభుత్వం రూ.14,500 కోట్ల బిడ్‌లనే స్వీకరించింది.  

మరిన్ని వార్తలు