భారత్‌ డైనమిక్స్‌- టాటా స్టీల్‌ మెరుపులు

30 Jun, 2020 10:25 IST|Sakshi

క్యూ4 ఫలితాల ఎఫెక్ట్‌

భారత్‌ డైనమిక్స్‌ 15 శాతం జూమ్‌

4.5 శాతం జంప్‌చేసిన టాటా స్టీల్‌

గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఓవైపు పీఎస్‌యూ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకిరాగా.. మరోపక్క నికర నష్టాలు ప్రకటించినప్పటికీ మెటల్‌ దిగ్గజం టాటా స్టీల్‌ కౌంటర్‌కూ డిమాండ్‌ కనిపిస్తోంది. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 167 పాయింట్లు బలపడి 35,129కు చేరగా.. నిఫ్టీ 70 పాయింట్లు పుంజుకుని 10,382 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఫలితాల నేపథ్యంలో భారత్‌ డైనమిక్స్‌, టాటా స్టీల్‌ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం

భారత్‌ డైనమిక్స్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ నికర లాభం​దాదాపు 150 శాతం దూసుకెళ్లి రూ. 310 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 57 శాతం పెరిగి రూ. 1468 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 2.55 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్‌ డైనమిక్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 15 శాతం జంప్‌చేసింది. రూ. 348 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 354 వరకూ ఎగసింది.

టాటా స్టీల్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రయివేట్‌ రంగ దిగ్గజం టాటా స్టీల్‌ రూ. 1096 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 2431 కోట్ల నికర లాభం​ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 20 శాతం క్షీణించి రూ. 33,770 కోట్లను తాకింది. ఇబిటా 38 శాతం వెనకడుగుతో రూ. 4647 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో టాటా స్టీల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 4.5 శాతం జంప్‌చేసింది. రూ. 336 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 338 వరకూ ఎగసింది. 

>
మరిన్ని వార్తలు