భారత్‌ తొలి ఆండ్రాయిడ్‌ గో ఫోన్‌ వచ్చేస్తోంది...

15 Jan, 2018 17:33 IST|Sakshi

భారత్‌ తొలి ఆండ్రాయిడ్‌ ఓరియో(గో ఎడిషన్‌) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు దేశీయ హ్యాండ్‌సెట్‌ తయారీదారి మైక్రోమ్యాక్స్‌ సిద్ధమైంది. రిపబ్లిక్‌ డే(జనవరి 26) సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ ఓరియో గో-స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్న తొలి కంపెనీ మైక్రోమ్యాక్సే కావడం విశేషం. ''భారత్‌ గో'' పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తుంది.  ఈ స్మార్ట్‌ఫోన్‌ను బెస్ట్‌-ఇన్‌-క్లాస్‌ మొబిలిటీ డివైజ్‌, ఆప్టిమైజ్ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ డివైజ్‌గా కంపెనీ అభివర్ణించింది. ఐదు వేల రూపాయల కంటే తక్కువగానే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర ఉంటుందని, 4జీ, వాయస్‌ఓవర్‌ ఎల్‌టీఈ సపోర్టు ఫీచర్లతో ఇది మార్కెట్‌లోకి వస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్‌ ఓరియో(గో ఎడిషన్‌)తో ఇది రన్‌ అవుతుంది. 

ఎంట్రీ లెవల్‌ డివైజ్‌లు మంచిగా పనిచేయడానికి ఆండ్రాయిడ్‌ గో ఎడిషన్‌ను గూగుల్‌ లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియోతో దీన్ని లాంచ్‌ చేస్తున్నట్టు గత నెలలోనే గూగుల్‌ పేర్కొంది.  ఈ ఓఎస్ ముఖ్యంగా 1జీబీ కంటే తక్కువ ర్యామ్, తక్కువ స్టోరేజ్‌ స్పేస్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్లలో అతివేగంగా పనిచేస్తుంది. ఫీచర్‌ ఫోన్‌ పాపులర్‌గా ఉన్న గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్‌ వాడకాన్ని పెంచడానికి ఈ ఓఎస్‌ దోహదం చేస్తుంది. ఆండ్రాయిడ్‌ గో ఎడిషన్‌తో వస్తున్న భారత్‌ గో స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లను, ధరను మైక్రోమ్యాక్స్‌ వెల్లడించనప్పటికీ, తొలిసారి స్మార్ట్‌ఫోన్‌ వాడే యూజర్లకు ఇది మంచి అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
 

మరిన్ని వార్తలు