ఎయిర్‌టెల్ నుంచి వింక్ గేమ్స్ యాప్..

30 Dec, 2015 00:45 IST|Sakshi
ఎయిర్‌టెల్ నుంచి వింక్ గేమ్స్ యాప్..

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ.. వింక్ మ్యూజిక్, వింక్ మూవీ స్ట్రీమింగ్ వ్యాపారాలు విజయవంతం కావడంతో తాజాగా వింక్ గేమ్స్ పేరిట గేమింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ వింక్ గేమ్స్ బీటా వెర్షన్ లైబ్రరీలో 2,000కు పైగా జాతీయ, అంతర్జాతీయ గేమ్స్ ఉన్నాయని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. తమ కంటెంట్ పోర్ట్‌ఫోలియోలో తామందిస్తున్న తాజా ఓటీటీ(ఓవర్ ద టాప్) ఇదని భారతీ ఎయిర్‌టెల్ డెరైక్టర్(కన్సూమర్ బిజినెస్) శ్రీని గోపాలన్ చెప్పారు. తమ ఇంటర్నెట్ వినియోగదారులకు ఇది ఉచితమన్నారు. ఇతర నెట్‌వర్క్ యూజర్లు కొంత మొత్తం చెల్లించి దీన్ని పొందవచ్చన్నారు.
 
ప్లేఫోన్ ఇన్‌కార్పొతో ఒప్పందం..
వింక్ గేమ్స్ కోసం అంతర్జాతీయంగా పేరున్న మొబైల్ సోషల్ గేమింగ్ కంపెనీ ప్లేఫోన్ ఇన్‌కార్పొతో ఒప్పందం కుదుర్చుకున్నామని గోపాలన్ తెలిపారు. వింక్ మ్యూజిక్, వింక్ మూవీస్‌లాగానే వింక్ గేమ్స్‌లో కూడా వినియోగదారులు గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో ఆడుకోవచ్చని వివరించారు. ఈ యాప్‌లో ప్రకటనలు కూడా ఉండవన్నారు. భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి డేటా ప్యాక్‌లతో  వింక్ గేమ్స్ ను అందిస్తున్నామని కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్లేఫోన్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాన్ జెర్నీ చెప్పారు.

మరిన్ని వార్తలు