రూ 10,000 కోట్లు చెల్లించిన ఎయిర్‌టెల్‌..

17 Feb, 2020 11:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మందలింపు, ప్రభుత్వ డెడ్‌లైన్‌ల నేపథ్యంలో మొబైల్‌ దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ ప్రభుత్వానికి బకాయిపడిన రూ 10,000 కోట్లను టెలికాం శాఖకు చెల్లించినట్టు వెల్లడించింది. స్వయం మదింపు కసరత్తు పూర్తయిన తర్వాత మిగిలిన బకాయిల చెల్లింపు పూర్తిచేస్తామని కంపెనీ వెల్లడించింది. భారతి ఎయిర్‌టెల్‌, భారతి హెక్సాకామ్‌, టెలినార్‌ల తరపున మొత్తం​ రూ 10,000 కోట్లు చెల్లించామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

తాము స్వయం మదింపు కసరత్తు చేపట్టామని, అది ముగిసిన మీదట సుప్రీంకోర్టులో తదుపరి విచారణ గడువులోగా మిగిలిన బకాయిల చెల్లింపును చేపడతామని స్పష్టం చేసింది. పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని టెలికాం శాఖ భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సహా టెలికాం కంపెనీలను కోరుతూ ఈనెల 14న ఉత్తర్వులు జారీ చేసింది. టెలికాం శాఖ ఆదేశాలకు బదులిచ్చిన ఎయిర్‌టెల్‌ తాము ఫిబ్రవరి 20లోగా రూ 10,000 కోట్లు చెల్లిస్తామని, మార్చి 17లోగా మిగిలిన మొత్తం చెల్లిస్తామని పేర్కొంది. ఇక లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం వాడకం చార్జీలు సహా భారతి ఎయిర్‌టెల్‌ ప్రభుత్వానికి రూ 35,586 కోట్లు బకాయిపడింది.

చదవండి : టెల్కోలపై సుప్రీం కన్నెర్ర!

మరిన్ని వార్తలు